
- అప్పులెన్ని తెచ్చారు.. కాంట్రాక్టు పనులు ఎవరికిచ్చారు
- ఎన్ని పైప్ లైన్లు వేశారు.. ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు
- అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి
- ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపైనా రిపోర్టు ఇవ్వాలని ఆదేశం
- మిషన్ భగీరథ పథకంలో గోల్ మాల్ జరిగినట్టు ఆరోపణలు
- విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: మిషన్‌భగీరథ పథకం లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన ఈ స్కీమ్ లో గోల్ మాల్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో అన్ని లెక్కలు తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ సంస్థలు, సింగరేణిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ లిస్టులో మిషన్ భగీరథను కూడా చేర్చింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మరిన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మిషన్ భగీరథ కోసం చేసిన అప్పులెన్ని, అవి ఎక్కడి నుంచి తెచ్చారు? ఇప్పటిదాకా పెట్టిన రూ.31 వేల కోట్లలో దేనికెంత ఖర్చు చేశారు? ఏమేం పనులు చేశారు? ఎన్ని కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేశారు? ఆ పైపులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరెవరికి కాంట్రాక్ట్ పనులు అప్పగించారు? ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులు ఎన్ని? అనే దానిపై పూర్తి వివరాలు అందజేయాలని సీఎం అడిగినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు నిజానికి ఇంత ఖర్చవుతుందా? 2014 వరకు గ్రామాల్లో ఉన్న ఇండ్లు ఎన్ని? అప్పటికి వాటిల్లో నల్లా కనెక్షన్ లేని ఇండ్లు ఎన్ని? అనే వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమగ్ర సమాచారం ఆధారంగా ఏవైనా అవకతవకలు జరిగినట్టు తేలితే, విచారణకు ఆదేశించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది.
కాగా, గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏమైంది? దానిపైనా పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికీ నీళ్ల పేరుతో మిషన్ భగీరథ మొదలుపెట్టి నీళ్లే ఇవ్వలేదని, అలాగే ఇంటింటికీ ఇంటర్నెట్ పేరుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రకటించి ఉత్త ముచ్చట్నే చేసిందనే విమర్శలు ఉన్నాయి. భారీ ఎత్తున అప్పులు తీసుకునేందుకు, నిధులు గోల్మాల్చేసేందుకే మిషన్‌భగీరథ ప్రాజెక్టును తీసుకువచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. చాలా చోట్ల మిషన్‌భగీరథ నీళ్లు సప్లై కావడం లేదని, నాసిరకం పైప్లైన్లు వేయడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి.
అంతా అప్పులతోనే..
ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్.. 2014లోనే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. అయితే 2016 ఆగస్టులో మిషన్‌భగీరథ పైలాన్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. డీపీఆర్ ప్రకారం.. ఈ పథకం అంచనా వ్యయం రూ.43,791 కోట్లు. ఇందులో ఇప్పటివరకు రూ.31 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. లక్షా 50 వేల కిలోమీటర్ల మేర పైప్లైన్లువేసినట్టు, ఈ పథకం కింద 2.72 కోట్ల జనాభాకు మంచినీళ్లు అందుతున్నట్టు అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు. కానీ కనెక్షన్లు ఇచ్చిన కొన్ని చోట్ల నల్లాలు బిగించకపోగా, మరికొన్ని చోట్ల ఇంకా పనులు కొనసాగుతున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. కాగా, మిషన్‌భగీరథ స్కీమ్‌కు మొదట భారీ అంచనాలతో డీపీఆర్రెడీ చేశారు. ముందు రూ.45 వేల కోట్లు అంచనా వేయగా, తర్వాత దాన్ని సవరించి రూ.43,791 కోట్లకు కుదించారు. తీరా చూస్తే ఖర్చు మాత్రం రూ.31 వేల కోట్ల లోపే ఉంది. ఇందులోనూ 77 శాతం అప్పులు ఉండగా, మిగిలిన 20 శాతమే రాష్ట్ర సర్కార్ఖర్చు చేసింది. అందులోనూ 3 శాతం కేంద్రం గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి ఇచ్చిన నిధులే ఉన్నాయి. మొత్తంగా మిషన్ భగీరథకు రాష్ట్ర ప్రభుత్వ ఖాజానా నుంచి చేసిన ఖర్చు కేవలం రూ.6,122 కోట్లు మాత్రమే.
గతంలో ఉన్న వాటికే లింక్..
ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో అప్పటి సీఎం కేసీఆర్ అన్నారు. కానీ అప్పటికి పనులు పూర్తి కాలేదు. ఎలక్షన్స్పూర్తయి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి చేయలేదు. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రూ.వేల కోట్లు పెట్టి పైప్ లైన్లు వేసి, నల్లా కనెక్షన్లు చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఇవ్వలేదు. అప్పటికే ఉన్న వాటికే లింక్‌చేసి వదిలేశారు. కానీ ఈ స్కీమ్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని పదేపదే ప్రస్తావిస్తూ వచ్చింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ మిషన్‌భగీరథ విషయాన్ని బీఆర్ఎస్సభ్యులు లేవనెత్తారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘వీళ్లు అధికారంలోకి రాకముందు జనం అసలు మంచినీళ్లే తాగనట్టు.. ఇంటింటికీ నల్లాలే లేనట్టు మాట్లాడుతున్నారు.. ఈ వివరాలు కూడా బయటకు తీస్తం’’ అని అన్నారు. దగ్గరి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు, కమీషన్లు దండుకునేందుకే మిషన్ భగీరథను తీసుకొచ్చారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కాగా, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మొదట మిషన్‌భగీరథకు వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఉప్పల వెంకటేష్ ను వైస్‌చైర్మన్‌గా నియమించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను తొలగించింది.
11 సంస్థల నుంచి అప్పులు..
మిషన్‌భగీరథ పథకానికి గత బీఆర్ఎస్ సర్కార్ఏకంగా 11 సంస్థల నుంచి అప్పులు తీసుకున్నట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మొత్తం రూ.24,061 కోట్ల మేర అప్పులు చేశారు. ఇష్టారీతిన దాదాపు అన్ని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారు. ఇందులో అత్యధికంగా హౌసింగ్అండ్అర్బన్డెవలప్మెంట్కార్పొరేషన్(హడ్కో) నుంచి రూ.4,235 కోట్లు తీసుకోగా, నాబార్డు నుంచి రూ.3,660 కోట్లు, కార్పొరేషన్‌బ్యాంక్ నుంచి రూ.1,665 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ (యూనియన్‌బ్యాంక్) నుంచి రూ.4,358 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ.2,320 కోట్లు, యూకో బ్యాంక్ నుంచి రూ.270 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.1,920 కోట్లు, ఐసీఐసీఐ నుంచి రూ.918 కోట్లు, విజయ బ్యాంక్ నుంచి రూ.2,385 కోట్లు అప్పు తీసుకున్నారు.