
- శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను తెప్పించుకుంటున్న ఆర్థిక శాఖ
- ఆదాయం, ఖర్చుల లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు
- గత ఆరు నెలల ఆమ్దానీ, ఖర్చుల వివరాలు తీసుకుంటున్న ప్రభుత్వం
- గ్యారంటీలకు అధిక కేటాయింపులు చేసేలా ప్లాన్
- జులై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలపై వివరాలు తెప్పించుకుంటూ రివ్యూలు చేస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం 4 నెలల కోసమే పెట్టుకున్నారు. జులై నెలలో ఓటాన్ అకౌంట్ ముగుస్తుంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తవడంతో త్వరలో పార్లమెంట్‌లో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను పెట్టేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
కేంద్ర బడ్జెట్ ఈ జూన్‌లో ప్రవేశపెడితే.. జులై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్‌ను పెట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఆరు నెలల నుంచి రాష్ట్ర ఆదాయం ఎలా ఉంది? ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల సగటు రాబడిపై లెక్కలు తీస్తోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న వివరాలు కూడా సేకరిస్తోంది. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు కూడా వేస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం కాగా, వాటిని ఎలా సర్దుబాటు చేయాలనే దానిపైనా ఆర్థిక శాఖ చర్చిస్తోంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూ.2.76 లక్షల కోట్లతో పెట్టగా.. ఈసారి ఫుల్బడ్జెట్ అంతకు మించి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదాయమెంత.. ఖర్చు ఎంత?
వాస్తవ బడ్జెట్టే పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అసలు ప్రతి నెలా రాష్ట్ర ఆదాయం ఎంత? ఖర్చు ఎంత? అనే లెక్కలను అధికారులు తీస్తున్నారు. ఆదాయంలో జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, సేల్స్ ట్యాక్స్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి నెలా ఆర్బీఐ నుంచి యావరేజ్‌గా రూ.4 వేల కోట్ల అప్పు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కంట్రిబ్యూషన్, కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా వంటివి వస్తాయి. ఇవన్నీ కలిపి ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.15 వేల కోట్లు వచ్చాయి. ఎన్నికలు కావడంతో కొన్నింటిపై ఆదాయ ప్రభావం చూపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో యావరేజ్ రాష్ట్ర రాబడి నెలకు కనీసం రూ.20 వేల కోట్లు ఉండేలా టార్గెట్ పెట్టుకుంటున్నట్లు తెలిసింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ల్యాండ్ లీజులు, సేల్స్, మైనింగ్ ఆదాయం పెంచడం వంటి వాటి ద్వారా మరింత ఆదాయం రాబట్టుకోవాలని చూస్తున్నది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈ ఆర్థిక సంవత్సరంలో మినిమమ్ రూ.25 వేల కోట్లు తెచ్చుకోవాలని భావిస్తున్నది.
అప్పులు, జీతాలకే ఎక్కువ..
మరోవైపు, రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అప్పులు, జీతాల చెల్లింపులకే పోతున్నట్లు ఆర్థిక శాఖ రివ్యూల్లో తేలింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలకే యావరేజ్‌గా రోజుకు రూ.207 కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో స్కీములకు, ఇతరత్రా వాటికి నిధుల సర్దుబాటుకు ప్రస్తుత సర్కార్ తిప్పలు పడుతోంది. ప్రతి నెలా కిస్తీలు, వడ్డీలకే రూ.6 వేల కోట్లకుపైగా చెల్లిస్తున్నట్టు పేర్కొంటున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పులకు.. కాంగ్రెస్ సర్కార్ ఆరు నెలల్లోనే రూ.30 వేల కోట్లపైనే రీపేమెంట్లు (అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు) చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీ వస్తే ప్రభుత్వ ఖజానాలో రూ.12 వేల కోట్లు కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కిస్తీలు, వడ్డీల చెల్లింపులతో పాటు ఇందులో నుంచే జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రూ.4,600 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర అత్యవసర ఖర్చులు తీసేస్తే ప్రభుత్వ పథకాలు, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులకు కూడా కొంత మొత్తం చెల్లించి క్లియర్ చేయాల్సి ఉంది. దీంతో చెల్లింపుల లెక్కలను కూడా అధికారులు పక్కాగా తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే స్కీములకు నిధుల కేటాయింపుపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
గ్యారంటీలు, హామీలకు పూర్తి నిధులు..
ఫుల్ బడ్జెట్‌లో గ్యారంటీలు, హామీలకు సరిపడా నిధులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మొత్తం రూ.2,75,891 కోట్లు పెట్టగా.. అందులో ఆరు గ్యారంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయించింది. పూర్తిస్థాయి బడ్జెట్‌లోనూ మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయనుంది. ఇప్పటికే కొన్నింటికి విధివిధానాలు రూపొందించుకుని అమలు చేస్తుండటంతో ఏ గ్యారంటీకి ఎంత అవుతుందనే దానిపై ప్రభుత్వానికి ఓ క్లారిటీ వచ్చింది. యువ వికాసంలో భాగంగా ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసేందుకు నిధులు ఇవ్వనున్నారు. పెంచిన పెన్షన్లు ఇచ్చేలా చేయూత కింద నిధులు పెంచనున్నారు. వృద్ధులు, గీత కార్మికులు, డయాలిసిస్, పైలేరియా, ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులు, బీడీ టేకేదార్లు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులకు రూ.4 వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్‌ను అందించాల్సి ఉంది. వీటన్నింటికీ సరిపడేలా నిధుల కేటాయింపులు చేస్తున్నారు.