
అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. బుధవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సామాజిక రంగాలలో నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తున్నదని, పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని సిఎం ఆదేశించారు. కలప స్మగ్లింగును గత పాలకులు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కొందరికి అలుసుగా మారిందని, ఐతే దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడంలో కేవలం అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్ పోలీసు వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరముందన్నారు. సమాజంలో భాగస్వామ్యమై నేరాలను అరికట్టినట్టు, ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా పోలీసులు అడవుల పట్ల అవగాహన పెంచుకుని, స్మగ్లింగు వంటి అటవీ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు.
అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ దిశగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు ఇరు శాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగు నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తద్వారా మాత్రమే సమాజానికి మనం అనుకున్న విధంగా సేవ చేయగలుగుతామన్నారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా వుందన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.