బీజేపీలో పదవుల రేసు.. త్వరలో కేంద్ర కేబినెట్​లో మార్పులు చేర్పులు

బీజేపీలో పదవుల రేసు.. త్వరలో కేంద్ర కేబినెట్​లో మార్పులు చేర్పులు

బీజేపీలో పదవుల రేసు
త్వరలో కేంద్ర కేబినెట్​లో మార్పులు చేర్పులు
రాష్ట్రం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే చాన్స్ 
రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని ప్రచారం  

హైదరాబాద్, వెలుగు : బీజేపీలో మార్పులు చేర్పులపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కొనసాగుతున్నది. వచ్చే వారంలోనే కేంద్ర కేబినెట్​లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మూడో వారం నుంచి పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈలోపే మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేయాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఈసారి కేబినెట్ కూర్పులో తెలంగాణకు కొత్త బెర్త్ దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే కేబినెట్ లో మార్పులు ఉంటాయని, ఆయా రాష్ట్రాలకు చెందిన కొత్త వాళ్లకు పదవులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నది. ఎన్నికలు జరిగే జాబితాలో తెలంగాణ కూడా ఉండడంతో కేబినెట్ కొత్త జాబితాలో రాష్ట్ర బీజేపీ లీడర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

కర్నాటక ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న మార్పులతో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అందుకే ఈసారి రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేలా మార్పులు జరుగుతాయనే చర్చ కొద్ది రోజులుగా జరుగుతోంది. రాష్ట్రంలో నలుగురు బీజేపీ తరఫున ఎంపీలుగా గెలిచారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.. రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఎంపీ కిషన్​రెడ్డి ఇప్పటికే కేంద్ర కేబినెట్​లో ఉన్నారు. ఈసారి మార్పుల్లో కిషన్​రెడ్డిని కేబినెట్​నుంచి తప్పించి.. రాష్ట్రానికి చెందిన మరో నేతకు చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కొత్తగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తరా? 

ఎలక్షన్​దగ్గర పడుతుండడంతో పనిలో పనిగా కేబినెట్​మార్పులతో పాటే రాష్ట్ర పార్టీలో పలు మార్పులపై హైకమాండ్ కసరత్తు చేసినట్లు తెలుస్తున్నది. కొత్త సమీకరణాల్లో భాగంగా కిషన్​రెడ్డిని కేంద్ర కేబినెట్ నుంచి తప్పించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. కిషన్​రెడ్డి గతంలో రెండుసార్లు పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. దీంతో పాటు అనుభవమున్న లీడర్​కావటంతో సీనియర్లను సమన్వయం చేస్తారనే అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కూడా ఉంటుందని హైకమాండ్ భావిస్తున్నది. అదే టైమ్​లో కేబినెట్​కూర్పులో బీసీ కోటాలో ఒకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నది. సంజయ్​కు చోటు ఇచ్చినట్లయితే.. ఆ కోటా కూడా భర్తీ చేసినట్లుగా ఉంటుందనే సమీకరణాలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీలో మార్పులు చేర్పులపై మూడు వారాలుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల వరకు అధ్యక్ష మార్పు ఉండదని పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ ఇటీవల స్పష్టం చేశారు. కానీ తాజాగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తెరపైకి రావటంతో కొత్త నియామకాలపై మళ్లీ చర్చ మొదలైంది.

కేబినెట్ బెర్త్ ఎవరికి? 

సెంట్రల్​ మినిస్టర్ ​రేసులో బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్​ సహా పలువురి పేర్లు వినిపిస్తు న్నాయి. సంజయ్ ​నాలుగేండ్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఐదు విడతలుగా సంజయ్​రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టడం పార్టీకి కొత్త ఊపు తెచ్చింది. జీహె చ్ఎంసీ ఎలక్షన్ తో పాటు దుబ్బాక, హుజూ రాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీని నడి పించడంలో సంజయ్​ కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియర్​నేతలను సమన్వయం చేయడంలో వెనుకబడ్డారు. దీంతో సీనియర్​లీడర్లు ఎవరికి వారే తోచినట్లు పార్టీ లైన్​ దాటి మాట్లాడడం.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేసింది. వీటిని సీరియస్​గా పరిగణించిన హైకమాండ్.. తెలంగాణలో పార్టీని చక్కదిద్దాలనే ఆలోచనలు చేస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ పెద్దలు ఇటీవల సీనియర్​ లీడర్లను ఢిల్లీకి పిలిపించి సమాలోచనలు చేశారు.