
- హ్యూమన్ ట్రాఫికింగ్‌లో మొదటి స్థానం
- ఏటా 5వ స్థానంలో రాష్ట్రం.. గతేడాది మొదటి స్థానం
- రాష్ట్రంలో 704 మందిని రెస్క్యూ చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు : మానవ అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. గత మూడేండ్లుగా రాష్ట్రంలో అత్యధికంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 391 కేసులు నమోదు కాగా.. 25 మంది బాలికలు, 9 మంది బంగ్లాదేశ్ యువతులు సహా మొత్తం 641 మంది మహిళలను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు రెస్క్యూ చేశారు.
మరో 38 మంది బాలురతో కలిపి మొత్తం704 మందిని కాపాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2022 నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. గతేడాది 2,250 కేసులు నమోదు కాగా ఇందులో 391 కేసులతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి కేసుల్లో మహిళలను రెస్క్యూ హోమ్స్‌కి తరలించారు. బాలకార్మికులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కొంత మందిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు.
ఇతర రాష్టాల నుంచి అక్రమ తరలింపు
ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం ఏటా దేశంలో 2 వేల మంది వరకు ట్రాఫికింగ్‌కు గురౌతున్నారు.600 మందికి పైగా మహిళలు 100 మందికి పైగా మైనర్లను మెట్రో నగరాలకు తరలిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మైనర్లను ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి తరలించిన మహిళలను గల్ఫ్ కంట్రీస్‌లో బానిసలుగా మార్చుతున్నారు. ఇలాంటి కేసులు రిజిస్టరైన రాష్ట్రాల్లో తెలంగాణ ఏటా 5వ స్థానంలో ఉండేది. ఐతే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఆపరేషన్స్‌తో కేసులు భారీగా పెరిగాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాకు గురైన మహిళలు హైదరాబాద్‌లో పోలీసులకు చిక్కుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎక్కువ కేసులతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 30 యూనిట్స్ సెర్చ్ ఆపరేషన్లు
ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నది. ఉద్యోగం, ప్రేమ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాల చేతుల్లో చిక్కి వ్యభిచార కూపంలో కూరుకుపోతున్నారు. బీహార్, యూపీ సహా నార్త్ ఇండియాలోని రాష్ట్రాల నుంచి బాలకార్మికులను అక్రమ రవాణా చేస్తున్నారు. బాలురు కిడ్నాప్‌కి గురై పరిశ్రమల్లో లేబర్‌గా, బెగ్గింగ్ మాఫియా చేతుల్లో బిచ్చగాళ్లుగా మారుతున్నారు. ఇలాంటి వారిని రెస్క్యూ చేసేందుకు దేశవ్యాప్తంగా 807 యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ పని చేస్తున్నాయి. రాష్ట్రంలో 30 యూనిట్స్ పని చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం సీఐడీ పోలీసులు, ఎన్‌జీఓస్, చైల్డ్ ప్రొటెక్షన్, లోకల్ పోలీసులు ‘ఆపరేషన్ స్మైల్’ పేరుతో సోదాలు నిర్వహిస్తున్నారు.