వ్యాక్సినేషన్​లో  మనం స్లో

వ్యాక్సినేషన్​లో  మనం స్లో

టీకా సెంటర్ల వద్ద జనం అవస్థలు
దేశంలో తెలంగాణకు14వ స్థానం 
1.76 కోట్ల డోసులతో మహారాష్ట్ర ఫస్ట్​ ప్లేస్​ 
కోటికి పైగా డోసులు వేసిన ఆరు రాష్ట్రాలు
మన దగ్గర అందులో సగం కన్నా తక్కువే
టీకాల కోసం ఇండెంట్​ పెట్టని రాష్ట్రం

వెలుగు, సెంట్రల్ ​డెస్క్​: కరోనా కేసులు పెరిగిపోతుండడంతో కొన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్​స్పీడ్​ పెంచాయి. మహమ్మారి కట్టడికి శరవేగంగా టీకా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాయి. నమోదవుతున్న కేసులు, మహమ్మారి తీవ్రతను వివరిస్తూ టీకాలకు ఇండెంట్​ ఎక్కువగా పెడుతున్నాయి. వాటిని పరిశీలించి దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్లను పంపుతోంది. కానీ, మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్న పరిస్థితులున్నాయి. కరోనా టెస్టుల దగ్గర్నుంచి వ్యాక్సిన్​ దాకా అన్నింట్లోనూ సర్కార్​ నిర్లక్ష్యం చూపిస్తోంది. కేసులను తక్కువగా చూపిస్తుండడం, మహమ్మారి తీవ్రత రాష్ట్రంలో అంతగా లేదని రాష్ట్ర సర్కార్​ పదేపదే ప్రకటిస్తుండడంతో.. అవసరాలను బట్టి మన రాష్ట్రానికి కేంద్రం వ్యాక్సిన్లను అందిస్తోంది. దీంతో వ్యాక్సినేషన్​ నెమ్మదిగా సాగుతోంది. మన రాష్ట్రం వ్యాక్సినేషన్​లో 14వ స్థానంలో ఉందంటేనే మన దగ్గర వ్యాక్సిన్లను ఎలా వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

వ్యాక్సిన్ల కోసం రాష్ట్రం నుంచి ఎలాంటి ఇండెంట్​ పెట్టలేదని శుక్రవారం హెల్త్​ డైరెక్టర్​ శ్రీనివాసరావు చెప్పారు. మహమ్మారి తీవ్రతను తగ్గించాలంటే వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్​ చేపట్టాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. మన పక్క రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలు  వారి మాటలను ఆచరణలో పెడుతున్నాయి. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో డ్రైవ్​ ఇన్​ వ్యాక్సినేషన్​ సెంటర్లనూ ఏర్పాటు చేశారు. ఆఫీసుకు వెళ్తూనో.. లేదా ఏదైనా పని కోసం వెళ్లినప్పుడో ఆ డ్రైవ్​ ఇన్​ సెంటర్​ వద్దే కార్​లో లేదా బైక్​పై కూర్చొనే వ్యాక్సిన్​ తీసుకునే వెసులుబాటు కల్పించారు. ముంబైలో దానిని అమలు చేస్తున్నారు. దాదర్​లో ఏర్పాటు చేసిన డ్రైవ్​ ఇన్​ సెంటర్​లో రోజూ 200 వరకు కార్లు లైన్​  కడుతున్నాయి. 400 మంది దాకా టీకాలు తీసుకుంటున్నారు. అది మంచి సక్సెస్​ కావడంతో అన్ని జోన్లలోనూ వాటిని ఏర్పాటు చేసేందుకు బృహన్​ ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ (బీఎంసీ) కసరత్తులు చేస్తోంది. అంధేరి స్పోర్ట్స్​ క్లబ్​, కూపరేజ్​ గ్రౌండ్​, శివాజీ స్టేడియం, ఓవల్​ మైదాన్​, బ్రబౌర్న్​ స్టేడియం, ఎంజీ గ్రౌండ్​, ఎంసీఏ గ్రౌండ్​, రిలయన్స్​ జియో గార్డెన్​లలోనూ డ్రైవ్​ ఇన్​ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లోనూ ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్​ టూరిజం కార్పొరేషన్​ ఆధ్వర్యంలో అశోకా హోటల్​లో డ్రైవ్​ఇన్​ సెంటర్​ను నడుపుతున్నారు. ఇటు ఒడిశా రాజధాని భువనేశ్వర్​లోనూ శనివారం డ్రైవ్​ ఇన్​ వ్యాక్సిన్​ సెంటర్​ను స్టార్ట్​ చేశారు. ఎస్​ప్లనేడ్​ షాపింగ్​ మాల్​లోని పార్కింగ్​ ప్లేస్​లో బైకులు, కార్లలో వచ్చిన 45 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఢిల్లీలోనూ ఇలాంటి కేంద్రాలను మొదలుపెట్టేందుకు నార్త్​ ఢిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్​ ప్లాన్స్​ చేస్తోంది. మల్టీలెవెల్​ పార్కింగ్​ ప్రదేశాల్లో డ్రైవ్​ ఇన్​ సెంటర్లు పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే ఈ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వంతో చర్చించామని నార్త్​ కార్పొరేషన్​ మేయర్​ జై ప్రకాష్​ చెప్పారు. కాగా, డ్రైవ్​ ఇన్​ సెంటర్లతో ప్రభుత్వ లేదా ప్రైవేట్​ వ్యాక్సినేషన్​ కేంద్రాల వద్ద జనాల రద్దీనీ తగ్గించేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. 
11.8 లక్షల మంది యూత్​ తీసుకున్నరు
కాగా, శుక్రవారం నాటికి 18 నుంచి 45 ఏళ్ల వయసున్నోళ్లలో 11,80,798 మందికి వ్యాక్సిన్​ వేశారు. ఈ జాబితాలో 2,24,109 మందికి వ్యాక్సిన్​ వేసిన గుజరాత్​ ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. 2,18,795 మందితో రాజస్థాన్​ సెకండ్​ ప్లేస్​లో ఉండగా, 2,15,274 మందితో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 1,83,679 మందికి, హర్యానాలో 1,69,409 మందికి టీకాలు వేశారు. 
దేశమంతటా 16.74 కోట్ల డోసులు 
కొవిన్​ వెబ్​సైట్​ ప్రకారం దేశమంతటా ఇప్పటిదాకా 16 కోట్ల 74 లక్షల 28  వేల 622 డోసుల వ్యాక్సిన్​ వేశారు. 13 కోట్ల 33 లక్షల 33 వేల 401 మంది ఫస్ట్​ డోసు తీసుకున్నారు.  3 కోట్ల 40 లక్షల 95 వేల 221 మందికి సెకండ్​ డోస్​ వేశారు. మొత్తంగా అన్ని రాష్ట్రాలకు 17.49 కోట్ల డోసులను పంపించినట్టు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రాల వద్ద ఇంకా 84 క్షల డోసులున్నాయని చెప్పింది. మరో మూడు రోజుల్లో 53.25 లక్షల డోసులను పంపించనున్నట్టు పేర్కొంది. ఏపీ సహా 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్​ను పంపట్లేదని వెల్లడించింది.
మహారాష్ట్ర ఫస్ట్​..
కరోనా కేసుల్లోనే కాదు.. వ్యాక్సినేషన్​లోనూ మహారాష్ట్ర ముందుంది. ఇప్పటిదాకా 1,76,17,719 డోసుల వ్యాక్సిన్​ వేసింది. అందులో 32,34,269 సెకండ్​ డోస్​ టీకాలు వేసింది. రోజూ 4 లక్షల మంది దాకా టీకాలు వేస్తోంది. రాజస్థాన్​, గుజరాత్​, యూపీ​, కర్నాటకలు టాప్​5లో ఉన్నాయి. మన పక్క రాష్ట్రం ఏపీ కూడా మన కన్నా మెరుగైన స్థానంలోనే ఉంది. వ్యాక్సినేషన్​లో టాప్​ టెన్​లో నిలిచింది. కేరళ, బీహార్​, వెస్ట్​బెంగాల్​ వంటి రాష్ట్రాలూ కరోనా టీకాలను వేగంగా వేస్తున్నాయి. మొత్తంగా 6రాష్ట్రాల్లో కోటి మందికిపైగా వ్యాక్సిన్​ వేశారు. 
రాష్ట్రంలో 52 లక్షల డోసులే
ఆరు పెద్ద రాష్ట్రాల్లో ఇప్పటికే కోటికిపైగా డోసులు వేస్తే మన రాష్ట్రంలో మాత్రం ఇంకా అరకోటి దగ్గర్నే ఉంది. ఇప్పటిదాకా మన దగ్గర 52,01,675 డోసుల టీకానే వేశారు. మొత్తంగా 43.88లక్షల  మందికి టీకా వేశారు. అందులో 8 లక్షల 13 వేల 675 మంది సెకండ్​ డోస్​ కూడా వేసుకున్నారు. ప్రస్తుతం సెకండ్​ డోస్​ టీకా కోసం 19 లక్షల మంది ఎదురు చూస్తున్నారని, వాళ్లకే వ్యాక్సిన్​ వేస్తామని శుక్రవారం హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. ఫస్ట్​ డోస్​ను ఎవరికీ వేయట్లేదు. ఎప్పటి నుంచి వేస్తారన్నదానిపైనా క్లారిటీ ఇవ్వలేదు. హెల్త్​ వర్కర్లు, ఫ్రంట్​ లైన్​ వర్కర్లు, 45 నుంచి 60 ఏండ్ల వాళ్లు కలిపి రాష్ట్రంలో 99,76,555 మంది ఉన్నారు. ఇందులో 52.01 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. యూత్​కు ఎప్పటి నుంచి వ్యాక్సిన్​ అనేదానిపై క్లారిటీ లేదు.