
పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం యెనెక్స్ సన్ రైస్ –11 తెలంగాణ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు షురూ అయ్యాయి. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచే ఇష్టమైన క్రీడల్లో పిల్లలు ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరును ఎడ్యుకేషనల్ హబ్ తో పాటు క్రీడా హబ్ గా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో ఉన్నారన్నారు.
వచ్చే ఒలింపిక్ క్రీడల్లో రాష్ట్రం నుంచి క్రీడాకారులు రాణించి పతకాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోసం జిల్లాకు 11.5 కోట్లను మంజూరు చేసిందని, క్రీడాకారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్ పీ వెంకటేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, క్రీడాకారులు పాల్గొన్నారు.