వర్సిటీలను కాపాడుకుందాం

వర్సిటీలను కాపాడుకుందాం

పన్నెండు వందల మంది ఆత్మబలిదానాల పునాదులపై ఏర్పాటైన తెలంగాణలో తొమ్మిది సంవత్సరాలుగా విద్యార్థి, నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలతో విద్య, వైద్యం మొదలు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయినవి. కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి నేడు విద్యారంగానికి నిధులు కేటాయించకుండా, నియామకాలు చేపట్టక పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కనీస మౌలిక వసతులు కూడా కల్పించకుండా విద్య విధ్వంసానికి తెరలేపారు. మరోవైపు అవినీతి, అధికార దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంలో అద్దాలమేడలతో అభివృద్ధి ఇదే అంటూ మేడిపండు సామెత గుర్తుతెస్తున్న పరిస్థితి.

వర్సిటీల మనుగడే ప్రశ్నార్ధకం !

తెలంగాణ వర్సిటీల పరిస్థితి దారుణమనే చెప్పవచ్చు. మానవ వనరుల వికాస కేంద్రాలైన విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యం అయిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమ జ్వాలలను రగిల్చిన యూనివర్సిటీలు నేడు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. భౌతిక వసతుల లేమి, ఆధునీకరణలేని అధ్యయనం, నిధుల కొరత, నియామకాల్లో జాప్యం, రోజురోజుకూ భూకబ్జా కోరల్లో అన్యాక్రాంతం అవుతున్న భూములతో యూనివర్సిటీల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఉస్మానియాను ఆక్స్​ఫర్డ్, కాకతీయాను కేంబ్రిడ్జి యూనివర్సిటీల స్థాయిలో మారుస్తామన్న  మాటలు మరుగునపడిపోయె. రాష్ట్రంలోని అన్ని  వర్సిటీల్లో  75 శాతానికి పైగా అధ్యాపక పోస్టుల ఖాళీలు, వేల సంఖ్యలో అధ్యాపకేతర ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సరం చేస్తూ యూజీసీ నిబంధనలకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం కామన్  రిక్రూట్​మెంట్ బోర్డు అంటూ కొత్త నాటకానికి తెరలేపింది. 

ఏటా బ్లాక్ గ్రాంట్ ను పెంచుతూ వర్సిటీలను అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ యూనివర్సిటీలకు పట్టంకడుతూ సామాన్య , పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులను యూనివర్సిటీ విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతున్నది. అంతేకాదు అకాడమిక్ స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యంతో నూతన వరవళ్ళు సృష్టిస్తూ వెలుగొందాల్సిన విశ్వవిద్యాలయాలు మితిమీరిన రాజకీయ ప్రమేయంతో స్వయం ప్రతిపత్తిని, ప్రతిష్టను సైతం కోల్పోతూ యూనివర్సిటీల  పాలన ప్రగతి భవన్ గడీల్లో బంది అయి వాటి అస్థిత్వాన్నే కోల్పోతున్నాయి. 

ALSO READ: బీఆర్​ఎస్​ను పాతరేస్తం..కేసీఆర్ అవినీతి పాలనపై పోరాడ్తం

యూనివర్సిటీల్లో  'ఫీ'జులుం

విద్యార్థి లోకం అనేక ఉద్యమాలు, ఒత్తిళ్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వ 2021 లో కొత్తగా అన్ని యూనివర్సిటీలకు వీ.సీ లను నియమించారు. వచ్చిన వీ.సీ లు పాలనపై దృష్టి పెట్టి యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తారనుకుంటే విద్యార్థుల నుండి దోచుకోవడం మొదలు పెట్టారు. దానితో 'పెనం నుండి పొయ్యిల పడ్డట్లు' విద్యార్థుల పరిస్థితి మారింది. పరిశోధన విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీల్లో  కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న ఫెలోషిప్స్ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్మిషన్ పొందిన ప్రతి పరిశోధన విద్యార్థికి ఫెలోషిప్ అందించి పరిశోధనలో నాణ్యత పెంచాలి. కానీ యూనివర్సిటీ అధికారులే పట్టనట్లు వ్యవహరిస్తూ వర్సిటీలను ఇంకా దిగజారుస్తున్నారు.

ఎవరి కోసం ప్రైవేట్ యూనివర్సిటీలు ?

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి  గ్రామీణ ప్రాంత విద్యార్థులకు యూనివర్సిటీ విద్య అందాలనే లక్ష్యంతో కొత్త ప్రభుత్వ యూనివర్సిటీలను నెలకొల్పితే, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం విద్యావ్యాపారం చేస్తూ 2021 సెప్టెంబలో ఆవరసం లేకున్నా తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇందులో రెండు వర్సిటీలకు సరైన వసతులు లేవని రిజక్ట్ చేశారు. అయినా కూడా అధికార పార్టీ నాయకుల అండతో అవి యూనివర్సిటీలుగా చలామణి అవుతూనే ఉన్నాయి. 

అడ్మిషన్​ తీసుకున్న 4000 మంది  విద్యార్థులను ఆందోళనలో ఉన్నారు.  ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అందించాల్సిన కనీస బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎపుడో మరిచిపోయింది.  స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వ విద్యను పాతరేస్తూ, ప్రైవేట్ విద్యను ప్రజలపై రుద్దడం నేర్చుకుంది.  ఈ ధోరణి మారకపోతే  ప్రజాక్షేత్రంలో పాలకుడికి తగిన శాస్తి తప్పదు.

- శ్రీహరి పగిడిపల్లి స్టేట్​ వర్కింగ్ 
కమిటీ మెంబర్, ఏబీవీపీ