
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని రెజిమెంటల్ బజార్ కు చెందిన నిజామొద్దీన్ చిన్నతనం నుంచి ఎన్ సీసీలో ప్రవేశం పొందాడు. 8వ తరగతి నుంచి పలు క్యాంపులకు హాజరవుతూ, సీనియర్ల ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో ఉమ్మడి ఏపీ నుంచి ఏకైక క్యాడెట్ గా గార్డ్ ఆఫ్ హానర్ కు అర్హత పొందాడు. మిలిటరీ అధికారుల ఫిజిక్ చూస్తూ మురిసిపోయి, తాను కూడా మంచి బాడీ బిల్డర్ గా రాణించాలనీ డిసైడ్ అయ్యారు. ఓవైపు ఉపాధి కోసం టెక్నికల్ ఇంజనీర్ గా పనిచేస్తూనే, బాడీ బిల్డింగ్ పై ఉన్న ఆసక్తితో సాధన చేయడం మొదలుపెట్టారు.
డబ్బుల్లేక పోటీ నుంచి తప్పుకున్నాడు
జాతీయ స్థాయిలో రాణించే అవకాశం వచ్చిందనీ సంతోషం ఉన్నా, సాధన చేసేందుకు అయ్యే ఖర్చులు నిజామొద్దీన్ ఎప్పుడు వెనక్కి నెడుతూనే ఉన్నాయి. దీంతో పోటీలకు హాజరయ్యేందుకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆ పోటీల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇక జీవనోపాధిని ఇచ్చిన జిమ్ లో పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు వచ్చే జిమ్ లో పని దొరకడంతో వచ్చే జీతం డబ్బులను తన బాడీ బిల్డింగ్ డైట్ కోసం వాడుకున్నారు.
సాయం కోసం ఎదురుచూపులు
బాడీ బిల్డింగ్ లో చాలా ప్రత్యేకమైన ఈవెంట్ మెన్ ఫిజిక్. సాధారణ బాడీ బిల్డింగ్ లాగా కండలు పెంచితే సరిపోదు. మెలి తిరగడంతోపాటు పదునైన పుష్టిగా ఉండే కండలను నిబ్బరంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. చాలా సాధన చేస్తే గానీ సాధ్యం కానీ ఈ కేటగిరీ నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉన్నా… చైనా, సౌత్ కొరియాల్లో జరిగే పోటీలకు హాజరయ్యేందుకు ఖర్చులకు డబ్బుల్లేవని నిజామొద్దీన్ వాపోతున్నారు. తన భార్య ప్రోత్సాహించిన, ఆమె ఇచ్చే డబ్బులు తన నెల డైట్ కు సరిపోతాయని చెబుతున్నారు. ఎంట్రీ ఫీజు, ట్రావెలింగ్, బోర్డింగ్ కలిపి నాలుగు లక్షల వరకు ఖర్చవుతుందనీ పేర్కొన్నారు. అయితే బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఉన్నా… ఆర్థికంగా ఎలాంటి సహకారం ఉండదనీ, సొంత ఖర్చులతో పోటీలకు హాజరు కావాల్సి ఉంటుందనీ, దీంతో వచ్చిన అవకాశాన్ని వదులుకునే ఇష్టం లేక, పోయేందుకు ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం ప్రభుత్వం స్పందించి, తనకు చేదోడుగా ఉంటే పోటీల్లో సత్తా చాటుతాననిధీమా వ్యక్తం చేస్తున్నారు.