TS టెట్ అప్లికేషన్స్ ఎన్నంటే..?

TS టెట్ అప్లికేషన్స్ ఎన్నంటే..?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ -2024కు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి టెట్ పరీక్షల కోసం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కి 99,210 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-2కి 1,84,231 మంది దరఖాస్తులు సమర్పించారు. సబ్జెక్టులవారీగా పరిశీలిస్తే.. పేపర్-2లో మ్యాథమెటిక్స్, సైన్స్‌కు 99,974 మంది దరఖాస్తు చేసుకోగా.. సోషల్ స్టడీస్‌కు 86,454 దరఖాస్తులు వచ్చాయి.పేపర్- 1కు ఆదిలాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 7,504 దరఖాస్తులు రాగా.. పేపర్- 2కు సంబంధించి నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 9,162 దరఖాస్తులు వచ్చాయి. 

టెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 10 లాస్ట్ డేట్ అని ప్రకటించి.. ఏప్రిల్ 20 వరకు గడువు పొడగించారు. ఏప్రిల్ 9 సాయంత్రం నాటికి కేవలం టెట్‌కు 1,93,135 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గడువు పొడిగించడంతో 10 రోజుల్లో 90 వేల మంది అభ్యర్థులు అదనంగా అప్లై చేసుకున్నారు. ఏప్రిల్ 11 నుంచి 20 వరకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా పేపర్-1లో 6,626 మంది, పేపర్-2లో 11,428 మంది అభ్యర్థులు ఉపయోగించుకున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లను మే 15 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. 

telangana TET application process complete