
- ఏటా 20 వేల కోట్లకు తగ్గకుండా వడ్డీలేని రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి
- 10 నుంచి లోన్ల చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడి
- మహిళలకు 5 వేల ఈవీ ఆటోలపై ఆలోచన చేస్తున్నం: పొన్నం
- ఇందిరా మహిళా శక్తి సంబురాలు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: మహిళా సాధికారతలో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ‘‘ఐదేండ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఏటా రూ.20 వేల కోట్లకు తగ్గకుండా రుణాలు అందిస్తాం. ఇప్పటికే మొదటి ఏడాది రూ.21 వేల కోట్లు అందించాం. ఇప్పుడు మరో విడత ఈ నెల 10 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేస్తాం” అని ప్రకటించారు.
శనివారం ప్రజాభవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబురాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి భట్టి ప్రారంభించారు. అద్దె బస్సులకు సంబంధించి ఆర్టీసీ నుంచి 151 మహిళా సంఘాలకు రావాల్సిన అద్దె రూ.1.05 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. మహిళా రచయితలు, కవులు రాసిన మహాలక్ష్మీ (మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేవలం వడ్డీలేని రుణాలే కాకుండా బ్యాంక్ లింకేజీ, లోన్ బీమా, ప్రమాద బీమా వంటి సౌకర్యాలను మహిళా సంఘాలకు ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పారు.
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, మహిళా సంఘాలకు ఇచ్చే ప్రోత్సాహకాలను బంజేసింది. మేం అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించి, మహిళా సంఘాలతో వ్యాపారాలు చేయిస్తున్నాం. ఈ నెల 10 నుంచి మరో విడత వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తున్నాం. వీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై 7 నుంచి 9 వరకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు సమావేశమై చర్చించుకోవాలి” అని సూచించారు. మహిళలను బస్సులకు ఓనర్లను చేసినం: పొన్నం
హైదరాబాద్‌లో 5 వేల ఈవీ ఆటోలు మహిళలకు కేటాయించాలని ఆలోచన చేస్తున్నామని, వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్తెలిపారు. ‘‘ఫ్రీ బస్ పథకంతో ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఉచితంగా ప్రయాణించిన మహిళల సంఖ్య త్వరలోనే 200 కోట్లకు చేరనుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.6,500 కోట్లు ఆర్టీసీకి చెల్లించింది” అని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు వాళ్లను ఆర్టీసీ బస్సులకు ఓనర్లు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.
ఇప్పటికే 25 వేల కోట్ల రుణాలిచ్చినం: సీతక్క
బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు రుణాలు ఎగవేస్తుంటే, తెలంగాణ మహిళలు క్రమశిక్షణగా చెల్లిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. అందుకే మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు క్యూ కడుతున్నాయని చెప్పారు. ఇదే ఇందిరా మహిళా శక్తి విజయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రూ.25 వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలు పొందాయని తెలిపారు.
ఆర్టీసీ అద్దె బస్సులకు మహిళా సంఘాలను యాజమానులుగా చేశామని, ఒక్కో బస్సు ద్వారా నెలకు రూ.70 వేల అద్దె వస్తున్నదని వెల్లడించారు. మొదటి నెలలోనే మహిళా సంఘాలకు రూ.కోటికి పైగా అందజేశామని తెలిపారు. అంతకుముందు ప్రజాభవన్‌లో మహిళా సంఘాల సభ్యులతో సీతక్క ముఖాముఖి నిర్వహించారు.