- ఐఏఎస్ జయేశ్ రంజన్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్స్కు సామాజిక భద్రత కల్పించే బిల్లును త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని, దీనికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) మద్దతు కోరుతామని ప్రకటించారు.
పీఎఫ్‌ఆర్‌డీఏ, కేఫిన్ టెక్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో నిర్వహించిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కార్పొరేట్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. రిటైర్‌మెంట్ ప్లానింగ్ గురించి చర్చించడానికి చాలా మంది ఇష్టపడరని ఆయన అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ, వ్యవస్థీకృత రంగ ఉద్యోగుల కోసం తగిన పెన్షన్ ఫ్రేమ్‌వర్క్ ఉందని ఆయన పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో ఉన్నవారినీ ఆదుకోవడానికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) బిల్లును తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని రంజన్ వెల్లడించారు.
