
- దేశంలోనే అత్యధిక ఆర్గాన్ డొనేషన్ రేట్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ
- 1,673 మంది డోనర్ల నుంచి 6,309 అవయవాల సేకరణ
- ఈ ఏడాది జులై నాటికే 125 మంది డోనర్ల నుంచి 464 ఆర్గాన్స్ కలెక్షన్
- జీవన్‌దాన్‌కు అవార్డు అందజేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
- హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర హెల్త్ మినిస్టర్ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు:అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున 0.8 ఆర్గాన్ డొనేషన్స్ జరిగితే, రాష్ట్రంలో 4.88 డొనేషన్స్ జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అవయవదానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకుగాను రాష్ట్రానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీవో) అవార్డు ప్రకటించింది. శనివారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవ దాన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జీవన్‌దాన్ ప్రతినిధులకు ఈ అవార్డు అందజేశారు. అవయవదానంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. అవయవాలు పాడైపోయిన వ్యక్తుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జీవన్‌దాన్ ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. పేద, ధనిక బేధం లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందేలా ఇటీవల తోట యాక్ట్‌ను అడాప్ట్ చేసుకున్నామన్నారు. బ్రెయిన్ డెడ్ కేసుల్లో అవయవాలు వృథా పోకుండా దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అవయవమార్పిడి చికిత్సను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఏటా 10-15 శాతం పెరుగుతున్న డోనర్ల సంఖ్య..
జీవన్ దాన్ ప్రారంభమైనప్పటి నుంచి డోనర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది జులై వరకు 1,673 మంది డోనర్ల నుంచి 6,309 కిడ్నీ, లివర్, హార్ట్, కార్నియా, హార్ట్ వాల్వ్‌లు, లంగ్స్, ప్యాంక్రియాస్ వంటి అవయవాలను సేకరించారు. గతేడాది 188 డోనర్ల నుంచి 725 అవయవాలు సేకరించగా, ఈ ఏడాది జులై నాటికే 125 మంది డోనర్ల నుంచి 464 అవయవాలు సేకరించడం విశేషం. ఏటా 10 నుంచి 15 శాతం డోనర్లు పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. జీవన్ దాన్ ద్వారా సేకరించిన అవయవాల్లో 2,516 కిడ్నీలు, 1,534 లివర్‌లు, 226 హార్ట్‌లు, 1,453 కార్నియాలు, 170 హార్ట్ వాల్వ్‌లు, 396 లంగ్స్, 14 ప్యాంక్రియాస్ ఉన్నాయి. వీటిలో 40 శాతం కిడ్నీలే ఉండటం విశేషం.