Telangana Tour : భూపాలపల్లి జిల్లాలో నాపాక ఆలయం.. 4 దిక్కుల్లో.. నలుగురు దేవుళ్లు

Telangana Tour : భూపాలపల్లి జిల్లాలో నాపాక ఆలయం.. 4 దిక్కుల్లో.. నలుగురు దేవుళ్లు

నాలుగు దిక్కులు.. నాలుగు ద్వారాలు.. నాలుగు విగ్రహాలు.. ఒకే రాయి. చెప్పడానికే కాదు... చూడటానికి కూడా చాలా ప్రత్యేకం నాపాక దేవాలయం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆలయం పేరే ఊరు పేరుగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

మండలంలోని నైన్ పాక గ్రామానికి దగ్గర్లో నాపాక దేవాలయం ఉంది. ఒకప్పు మనుకుంట్లగా ఈ ఊరికి పేరుండేది. నాపాక ఆలయం ఉండటంతో క్రమంగా ఊరు పేరు నైన్ పాకగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పాలకులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఆలయం అభి వృద్ధి చెందడంతో పాటు ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడ నిత్య పూజలతో పాటు ఏడాదికి ఒకసారి పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. 'ఇలాంటి ఆలయం దేశంలో ఎక్కడా లేదు. ముందుముందు సుప్రసిద్ధ దేవాల యంగా నాపాక ఆలయానికి పేరొస్తుంద'ని ఈ ఆలయాన్ని సందర్శించిన వాళ్లు, పురావస్తు శాఖ, దేవాదాయ శాఖల అధికారులు చెబుతున్నారు. 

సర్వతోభద్ర దేవస్థానం 

ఒకే రాయికి నాలుగు వైపులా విగ్రహాలు చెక్కి ఉన్నాయి. ఆలయంలోని నాలుగు ద్వారాల గుండా ఏ మార్గం నుంచి వెళ్లినా దేవతామూర్తులు కనిపిస్తారు. నాపాక ఆలయాన్ని ప్రస్తుతం నాపాక సర్వతోభద్ర దేవస్థానంగా పిలుస్తున్నారు. గ్రామ శివారులోని బండరాళ్లపైన ఈ ఆలయం ఉంది.

సమీపంలో పెద్ద చెరువు, కాకతీయుల కాలంనాటి ఆనవాళ్లు, ఆలయంలో ఉన్న విగ్రహాలు, గుడి గోపురం భక్తులను, పర్యాటకులను ఆకట్టు కుంటాయి. ఆలయం లోపల నాలుగు విగ్రహాల చుట్టూ భక్తులు తిరిగేలా ఖాళీ స్థలం ఉండటం మరోప్రత్యేకత.

నాలుగు వైపులా దేవతామూర్తులు

ఆలయంలో తూర్పు ముఖ ద్వారంలో శ్రీ లక్ష్మీన రసింహ స్వామి, పడమర ద్వారంలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి. ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామ లక్ష్మ ణులు, దక్షిణ ద్వారంలో శ్రీ కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ విగ్రహాలు కనిపిస్తాయి. ప్రతి ఏడాది జనవరిలో నాలుగు రోజుల పాటు జాతర నిర్వ హిస్తుంటారు. జాతరను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా వస్తుంటారు. జాతర సమయంలో గణపతి పూజలు, నవగ్రహ పూజలు, వాస్తు హోమాలు, లక్ష్మీ నారాయణ కల్యాణం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, వాహనాలు, బండ్లు తిరగడం, లక్ష్మీ నరసిం హస్వామి ఉత్సవాలు, ఊరేగింపులు చేస్తారు. ప్రతి రోజు పర్యాటకులు, అధికారులు కూడా ఈ ఆలయ దర్శనానికి వస్తుంటారు. 'అభివృద్ధి పనులు పూర్తయితే భవిష్యత్తులో పర్యాటకంగా ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందుతుంద'ని ఆలయ ప్రధాన అర్చకుడు పెండ్యాల ప్రభాకరాచా ర్యులు చెప్పారు.

మాజీ స్పీకర్ చొరవతో వెలుగులోకి.. 

ఆలయ విశిష్టత గురించి 2016 సెప్టెంబర్ 23న ఈ ప్రాంత పర్యటనలో ఉన్న అప్పటి స్పీకర్ మధు సూదనాచారికి గ్రామస్తులు వివరించారు. దీంతో ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ.3కోట్లు మంజూరు చేయించారు.

జిల్లా నిధుల నుంచి ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.70 లక్షలు, సీఎస్ఆర్ ఫండ్ నుంచి కమిటీ హాల్, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.70లక్షలు మంజూరు చేయించారు. ఆలయ అభివృద్ధి కమిటీని కూడా నియమించారు. 'ఆలయానికి సీసీ రోడ్డు పనులు, ప్రహరీ నిర్మాణం పూర్తయింది. ఇంకా మండపాల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు పెండింగ్ ఉన్నాయని' ఆలయ కమిటీ చైర్మన్ ఏరుకొండ గణపతి చెప్పారు.