V6 News

జాతరలకు, గుళ్లకు ఎలక్ట్రిక్ బస్సులు.. సిటీ శివారు ప్రాంతాల్లోని కాలనీలకూ 373 నడుపుతం: మంత్రి పొన్నం

జాతరలకు, గుళ్లకు ఎలక్ట్రిక్ బస్సులు.. సిటీ శివారు ప్రాంతాల్లోని కాలనీలకూ 373 నడుపుతం: మంత్రి పొన్నం
  • కొత్తగా 7 లక్షల మంది ప్రజలకు అందుబాటులో ప్రజా రవాణా వ్యవస్థ 
  • రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 ఈవీ బస్సులు ప్రారంభం

సమ్మక్క సారలమ్మ జాతరకు, శ్రీశైలం, యాదాద్రి తదితర దేవస్థానాలకు ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ను నడుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్, వెలుగు: సమ్మక్క సారలమ్మ జాతరకు, శ్రీశైలం, యాదాద్రి తదితర వంటి దేవస్థానాలకు ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌ను నడుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు కాలుష్యరహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని రాణిగంజ్‌‌లో 65 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రారంభించి, మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిటీ, సిటీ శివారు ప్రాంతాల్లోని 373 కాలనీలకు ఈవీ బస్సులు నడుపనున్నట్లు, దీంతో కొత్తగా 7 లక్షల మంది ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థ కిందకు వచ్చినట్లు తెలిపారు. 

ప్రజా రవాణాలో మరిన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఆర్టీసీని మరింత దగ్గర చేస్తామని చెప్పారు. చాలా కాలనీలకు బస్సులు నడవడం లేదని, బస్సులు ఏయే ప్రాంతాలకు అవసరమనే దానిపై గత రెండు నెలలుగా సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. సిటీలోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బస్సులు ఏ రూట్లలో నడపాలో తమకు తెలియజేస్తే పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ఐటీ కారిడార్‌‌‌‌లలో కూడా సంబంధిత కార్యాలయాలకు చెందిన వారు బస్సులు నడపాలని కోరితే అందుకు తాము సిద్ధమని తెలిపారు. 

ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు అని, సంస్థను అంతటా విస్తరిస్తామన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతం కేవలం 0.001 మాత్రమేనని మంత్రి పొన్నం తెలిపారు. రవాణా శాఖలో, ఆర్టీసీలో ఈ రెండేండ్లలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, ఇంకా తీసుకొస్తామని వెల్లడించారు.

రాష్ట్రంలో 28 శాతం ఉన్న ప్రజా రవాణా వ్యవస్థను 70 శాతానికి పెంచినప్పుడే విజన్ 2047 లక్ష్యం నెరవేరుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో రవాణా శాఖ కీలక పాత్ర పోషించాలని చెప్పారు. 

బుధవారం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లోని ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వారి సమస్యలు, ప్రజా రవాణాలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. సాధ్యమైనంత వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. 

ఉచిత బస్సు ప్రయాణం పూర్తయి రెండేండ్లు అయిన సందర్భంగా ఈ విజయం ఉద్యోగులదేనని, ఈ శ్రమలో భాగస్వాములైన ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ లను మంత్రి పొన్నం అభినందించారు. సంస్థను పరిరక్షించుకోవడం, ఉద్యోగుల సంక్షేమం చూడడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం తమ ప్రధాన బాధ్యత అని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు అధునాతన స్కూల్  ఏర్పాటు చేస్తామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు
ఆర్టీసీ ఉద్యోగులపై ఎవరైనా దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొన్నం హెచ్చరించారు. బస్ స్టేషన్ల ముందు ప్రైవేట్ వాహనాలను పార్క్ చేసి ప్రయాణికులను తరలిస్తే వారిపై కేసులు బుక్ చేసి, వెహికల్స్ ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మహాలక్ష్మి పథకంతో  90కి పైగా డిపోలు లాభాల బాటలో ఉన్నాయని వివరించారు.