బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 1,200 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జేఏసీ కన్వీనర్ డా. పరుశురాం, కో కన్వీనర్ డా. విజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ లో 11 రోజులు సమ్మె చేయగా, సీఎం సానుకూలంగా స్పందించి ప్రకటన చేశారన్నారు.
ఆయనపై నమ్మకంతో సమ్మె విరమించామని, కానీ, 6 నెలలు గడుస్తున్నా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా సీఎం జోక్యం చేసుకొని హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తమ సమస్యలను మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి ఈనెల 4న ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేషన్బిల్డింగ్వరకు ర్యాలీ నిర్వహించబోతున్నట్టు చెప్పారు. ఇందులో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొఫెసర్ హర గోపాల్ పాల్గొంటారని చెప్పారు.
