పెన్ డౌన్ చేస్తం..సీఎం వ్యాఖ్యలపై వీర్వోలు గరం గరం

పెన్ డౌన్ చేస్తం..సీఎం వ్యాఖ్యలపై వీర్వోలు గరం గరం

హైదరాబాద్‌‌‌‌, వెలుగుఅసెంబ్లీలో సీఎం కేసీఆర్‌‌‌‌ చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగ భద్రతపై ఆందోళనకు గురవుతున్న వీఆర్వోలు ఆందోళనలకు సిద్ధమయ్యారు. వీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న మాటలు తమ మనోధైర్యాన్ని దెబ్బతీశాయని, ప్రభుత్వ పెద్దలు తమను బద్నాం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. 27వ తేదీ నుంచి ఆందోళనలు మొదలుపెట్టాలని, ప్రభుత్వం స్పందించకుంటే పెన్​డౌన్​ చేయాలని తీర్మానించారు.

ఐదు రోజులుగా నిరసనలు..

ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్‌‌‌‌ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌‌‌‌  వీఆర్వోలను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘భూముల విషయంలో వీఆర్వోలకు ఎవరికీ లేని అధికారం ఉంది, ఒకరి భూములు మరొకరి పేరుపై ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు..’ అన్నారు. ఈ మాటలపై వీఆర్వోలు ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలను ఉధృతం చేయడం, భవిష్యత్​ కార్యాచరణపై గురువారం హైదరాబాద్​లో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం సమావేశమైంది. ప్రభుత్వ పెద్దల మాటల తీరుతో తమ ఉద్యోగాలకే ముప్పు వచ్చిన నేపథ్యంలో గట్టిగా పోరాటం చేయాలని వీఆర్వోలు నిర్ణయించారు. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారాన్ని మౌనంగా భరించాల్సిన అవసరం లేదని, అవసరమైతే పెన్‌‌‌‌డౌన్‌‌‌‌ చేయాలని తీర్మానించారు. భూములను ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపై మార్చే అధికారం, ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో లాగిన్‌‌‌‌ తహసీల్దార్లకే ఉందని వారు స్పష్టం చేశారు. తమకు లేని అధికారాన్ని ఆపాదిస్తూ బద్నాం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో సాంకేతిక సమస్యలను సరిచేయకుండా.. ఆలస్యానికి తమను బాధ్యులను చేస్తున్నారని వారు మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలు నుంచి ఎన్నికల విధుల దాకా 67 పనులను తమతో చేయిస్తున్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌‌‌‌ వ్యాఖ్యలకు నిరసనగా, ఉద్యోగ భద్రత కోసం ఈ నెల 27 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని, ఆగస్టు 2న కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించినట్టు వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్‌‌‌‌రావు, ప్రధాన కార్యదర్శి హెచ్‌‌‌‌.సుధాకర్‌‌‌‌రావు చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రికి చెప్పుకుంటామని.. కానీ సమస్యలు తీర్చే వ్యక్తే తమను దొంగలుగా చిత్రీకరిస్తే ఎవరికీ చెప్పుకోవాలని పేర్కొన్నారు.