21న తెలంగాణలోకి రుతు పవనాలు.. 25 నుంచి వర్షాలు

21న తెలంగాణలోకి రుతు పవనాలు.. 25 నుంచి వర్షాలు

తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. జూన్  21 తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. జూన్  25 నుండి రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రైతులు జూన్  25 తేదీ తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చని సూచించింది. బిపార్జాయ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలోకి  రుతుపవనాలు కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. జూన్ 18వ తేదీ వరకు రుతుపవనాల విస్తరణ నెమ్మదిగా సాగింది. 

రుతుపవనాల ఆలస్యంతో  తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కరీంనగర్, ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ , మంచిర్యాల, మహబూబ్నగర్ జిల్లాలలో వేడి గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. 

నైరుతి రుతుపవనాల ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించాయి. ఈ రుతు పవనాలు.. జూన్ 21వ తేదీ బుధవారంమంగళవారం తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాకే రుతు పవనాలు.. రాష్ట్రం మొత్తం విస్తరించటానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే జూన్ 23, 24 తేదీల నాటికి రాష్ట్రం మొత్తం విస్తరించటానికి అవకాశం ఉందన్నారు.