అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ విచారణ

అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ విచారణ
  • ఐదు ఐవీఎఫ్ సెంటర్ల సిబ్బందికి వేర్వేరుగా ప్రశ్నలు
  • యజమానులు రాకుండా సిబ్బందిని పంపడంపై చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: నిరుపేద మహిళలను టార్గెట్ చేస్తూ సాగుతున్న అక్రమ అండాల సేకరణ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. ఈ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇందిరా ఐవీఎఫ్, నర్మద ఫెర్టిలిటీ, ఓయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు ఏఆర్టీ, పద్మజ ఫెర్టిలిటీ సెంటర్లకు కమిషన్ గతంలో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు ఆయా సెంటర్ల ప్రతినిధులు సోమవారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ప్రధాన నిర్వాహకులు రాకుండా తమ వద్ద పనిచేసే ఉద్యోగులను పంపడంపై మహిళా కమిషన్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ నేరెళ్ల శారద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమిషన్ ఇచ్చిన నోటీసుల మేరకు హైదరాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌ఓ) తన టీమ్‌‌‌‌‌‌‌‌తో కలసి విచారణకు హాజరయ్యారు. వీరిని కమిషన్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. పేద మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్న హాస్పిటల్స్, సెంటర్లపై కఠినంగా వ్యవహరించాలని వైద్యాధికారులకు చైర్ పర్సన్ సూచించారు. వాస్తవాలను పరిశీలించాక అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ఆయా సెంటర్ల అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు.

పరిశీలన తర్వాత చర్యలు... 

ఐదు సెంటర్లకు సంబంధించిన సిబ్బందిని కమిషన్ వేర్వేరుగా విచారించింది. ఆయా సెంటర్లపై వచ్చిన కథనాలు, ఫిర్యాదుల ఆధారంగా ప్రశ్నించి, రాతపూర్వక వివరణ తీసుకుంది. వారి వివరణలను పరిశీలించాకే తదుపరి చర్యలు ఉంటాయని నేరెళ్ల శారద స్పష్టం చేశారు. తర్వాతి జరిగే విచారణకు సంబంధిత సెంటర్ల ప్రధాన నిర్వాహకులు స్వయంగా హాజరుకావాలని, మళ్లీ సిబ్బందిని పంపి తప్పించుకోవాలని చూస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.