- గవర్నర్ను మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: పేద, మధ్యతరగతి మహిళలను ప్రలోభపెట్టి అక్రమంగా అండాలు సేకరిస్తున్న వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ కోరింది. కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, సభ్యురాలు ఉజ్మా షకీర్ బుధవారం లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. కమిషన్ విచారణ, అధికారుల నుంచి సేకరించిన సమాచారం, వెలుగులోకి వచ్చిన కీలక అంశాలను ఆయనకు వివరించారు. పలు రాష్ట్రాల మహిళలను ఉద్యోగ, ఈవెంట్ అవకాశాల పేరుతో హైదరాబాద్ కు రప్పించి, వారి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమ అండాల సేకరణలో దింపుతున్నారని కమిషన్ తెలిపింది. బాధితుల్లో వివిధ రాష్ట్రాల మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు విచారణలో గుర్తించామంది. పోలీసు దర్యాప్తు వివరాలతో పాటు నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గవర్నర్ కు వివరించింది.
కమిటీ, చట్ట సవరణలకు విజ్ఞప్తి
ఈ దందా వివిధ రాష్ట్రాలకు విస్తరించినందున, పూర్తి నెట్ వర్క్ ను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని, ఉన్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని కమిషన్ కోరింది. కేంద్రం తెచ్చిన ఏఆర్టీ చట్టం అమలులోని లోపాలు, ఖాళీలను గుర్తించి, మహిళల హక్కులు, ఆరోగ్యం, భద్రతకు రక్షణ కల్పించే సవరణలను కేంద్రానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసింది. కమిషన్ వివరణపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు కమిషన్ పేర్కొన్నారు.
