ఎడారి దేశంలో కార్మికుల గోస

ఎడారి దేశంలో కార్మికుల గోస

మెట్ పల్లి, వెలుగు:  ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉండలేక, తిరిగి రాలేక పదేళ్ల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్నవారు దేశం విడిచి వెళ్లాలని కొన్నేళ్ల క్రితం సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష అవకాశం కల్పించింది. అయితే తెలంగాణ  కార్మికులపై అక్కడి షేకులు, యజమానులు తప్పుడు కేసులు పెట్టడంతో కార్మికులకు అవుట్​పాస్​పోర్టులను మన ఎంబసీ ఆఫీస్​అధికారులు జారీ చేయలేకపోయారు. స్వదేశానికి రావడానికి పలుసార్లు ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు వెళ్లినా అక్కడి ఆఫీసర్లు స్పందించడం లేదని వాపోతున్నారు. సౌదీలో పని చేయలేక.. తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన గంగారాంతో పాటు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లె నిజామాబాద్ గ్రామానికి చెందిన కుడుకాల ఎల్లయ్య, పసిరపు తిరుపతి, పెద్దూరు గ్రామానికి చెందిన కత్తెర పోచయ్య, నిజామాబాద్ జిల్లా బలకిందకు  చెందిన చాకలి ప్రకాశ్, నిర్మల్ జిల్లా లక్మన్ చందా మండలం తిరుపల్లి గ్రామానికి చెందిన కొత్తపాటి రాజేశ్వర్ తో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన గల్ఫ్ బాధితులు ఇంటికి రాలేక పదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ స్పందించి తమందరిని స్వదేశానికి రప్పించాలని కంటతడి పెడుతూ వీడియోలు పంపిస్తున్నారు.
తప్పని రహస్య జీవనం
గల్ఫ్​ వెళ్లాలనుకునేవారికి ఇక్కడ ఏజెంట్లు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. తక్కువ పని.. ఎక్కువ జీతం అంటూ ఆశ పెడుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక చెప్పినట్లు కాకుండా ఇతర పనులు చేయిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. సౌదీలో చాలాచోట్ల 18 గంటలు పని చేయించి జీతాలు ఇచ్చేవారు కాదని కార్మికులు వాపోతున్నారు. ప్రశ్నిస్తే కొట్టడంతో చాలామంది వారి దగ్గర మానేసి బయట పనులు చేశారు. దాంతో అలాంటివారందరికి అఖామా, స్పాన్సర్ లెటర్ లేకుండా పోయాయి. పోలీసులకు పట్టుబడితే కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుందనే భయంతో కార్మికులు రహస్య జీవనం గడుపుతున్నారు. తమకు ఎలాగైనా దౌత్య సహాయం అందించి ఇండియాకు పంపించాలని కార్మికులు రియాద్​లోని ఎంబసీ ఆఫీస్ అధికారులను  వేడుకున్నారు. అయితే  ఆఫీసర్లు  తాము సహాయం అందించలేమని చేతులెత్తేయడంతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను వీడియోలు తీసి  సోషల్ మీడియా ద్వారా ఇక్కడికి పంపిస్తున్నారు. కరోన స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారు ఏడాదిగా సరైన తిండి కరువైందని, తమ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సౌదీలో రహస్యంగా ఉంటున్న కార్మికుల్లో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలకు చెందిన సుమారు 120 మంది ఉన్నట్లు సమాచారం.

పదకొండేళ్లుగా నరకం అనుభవిస్తున్నా
ఊళ్లో ఉన్నప్పుడు కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేటోన్ని. కుటుంబ పోషణ భారమై అప్పులు చేయాల్సి వచ్చింది. దాంతో ఏజెంట్ ద్వారా 2010లో రియాద్​లోని ఓ లాండ్రిలో ఇస్త్రీ పని కోసం వెళ్లా. రోజూ18 గంటల డ్యూటీ చేస్తే  350 రియాల్స్​ ఇచ్చేవారు. ఆ డబ్బులు ఖర్చులకు సరిపోయేవి. ఇలా 11 నెలలు పని చేసిన. జీతం పెంచమంటే వేధించేవారు. గత్యంతరం లేక అక్కడి నుంచి పారిపోయి వేరే ప్రాంతంలో కొన్ని నెలలు పని చేశా. నా పాస్ పోర్టు, అఖామా రెండు పాత యజమాని వద్దనే ఉంచుకున్నాడు. అఖామా లేకపోవడంతో వేరేచోట పనిలో నుంచి తొలగించారు. ఇండియాకు రావాలని పలుసార్లు ప్రయత్నించా. కానీ నా యజమాని నేను తన ఇంట్లో డబ్బులు దొంగతనం చేశానని అక్రమ కేసు పెట్టించాడు. కేసు తొలగించే వరకు ఇండియాకు వెళ్లడం కుదరదని అంటున్నారు. పని లేక అక్కడక్కడ అడుక్కుంటూ వచ్చిన డబ్బుతో బతుకుతున్న.  దయచేసి నన్ను ఇండియాకు రప్పించండి. 
                                                                                                – సోషల్​ మీడియాలో వీడియో పోస్ట్​ చేసిన చాకలి ప్రకాశ్, బాల్కొండ, నిజామాబాద్ జిల్లా


అక్రమ కేసు బనాయించిన్రు
ఆరేళ్ల క్రితం ఏజెంట్​కు రూ.80 వేలు ఇచ్చి డ్రైవర్ పనిపై సౌదీ వెళ్లా. రియాద్ ఎయిర్ పోర్టులో దిగగానే కారులో ఎక్కించుకొని సిటీకి  200 కి.మీ. దూరం ఎడారిలో ఉన్న గొర్ల మంద దగ్గరకు తీసుకెళ్లారు. గొర్రెలు మేపాలని చెప్పారు. డ్రైవర్ పనిమీద వచ్చాను.. ఆ పనే చేస్తానని అనడంతో కొట్టారు. వారం రోజులు తిండి పెట్టలేదు. కేవలం నీళ్లు తాగి గడిపాను. ఎవరు లేని టైం చూసి అక్కడి నుంచి పారిపోయాను. నేను గొర్రెలు అమ్ముకొని పారిపోయానని నాపై అక్రమ కేసు పెట్టారు. అప్పటి నుంచి పోలీసుల కంట పడకుండా ఎక్కడ పని దొరికితే అక్కడ చేస్తూ కాలం గడుపుతున్నా. కేసు కొట్టేస్తేనే ఇండియాకు వెళ్లొచ్చని ఇక్కడి తెలుగువారు చెబుతున్నారు. నా ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఇటీవల మా అమ్మ చనిపోయింది. ఆఖరిచూపు కూడా దక్కలేదు. సర్కారు స్పందించి మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లాలి. 
                                                                                                          - కుడుకాల ఎల్లయ్య, కోనరావుపేట మండలం, సిరిసిల్ల జిల్లా

మూడేళ్లుగా పని ఇస్తలేరు
ఎనిమిదేళ్ల క్రితం నెలకు వెయ్యి రియాల్స్​ జీతం ఇస్తామనడంతో బిల్డింగ్​ పని కోసం ఏజెంట్ కు రూ.60 వేలు చెల్లించి సౌదీ వచ్చా. రోజూ 16 గంటలు పని చేస్తే జీతం 400 రియాళ్లు ఇచ్చేవారు. జీతం సరిపోక అక్కడి నుంచి పారిపోయి వేరే ప్రాంతంలో రెండేళ్లు పని చేశా. పాత కంపెనీవారు సైట్​వద్ద సామాన్లు అమ్ముకుని పారిపోయానని కేసు పెట్టారు. అఖామా లేకపోవడంతో మూడేళ్ల నుంచి ఎవరూ పని ఇవ్వడం లేదు. దయచేసి నన్ను ఇండియాకు రప్పించి పుణ్యం కట్టుకోండి. 
                                                                                                                                            - కత్తెర పోచయ్య, పెద్దూరు గ్రామం, సిరిసిల్ల  జిల్లా