యూజర్ల కోసం టెలిగ్రామ్ కొత్త ఫీచర్లు

యూజర్ల కోసం టెలిగ్రామ్ కొత్త ఫీచర్లు

యూజర్ల కోసం టెలిగ్రామ్ కొత్త అప్​డేట్ తీసుకొస్తోంది. ‘టెలిగ్రామ్ ప్రీమియం’ పేరుతో కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్ తెచ్చింది. ఈ అప్​డేట్​ ద్వారా యూజర్లకు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రీమియం తీసుకుంటే... యూజర్లు 4 జిబి సైజ్​ ఫైళ్లను పంపించొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు కూడా. ఫైళ్లు, ఫొటోల్ని తొందరగా డౌన్​లోడ్ చేయొచ్చు. అంతేకాదు  టెలిగ్రామ్​లో  కొత్తగా ఏ ఫీచర్​ తెచ్చినా అది ముందుగా ప్రీమియం సబ్​స్క్రయిబర్స్​కు అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ ధర నెలకు 460 రూపాయలు. మామూలుగా అయితే వాయిస్ మెసేజ్​లని విన్న తర్వాతే రిప్లయ్​ ఇస్తుంటాం. కానీ, ఈ కొత్త ఫీచర్​ ఉంటే వాయిస్​ మెసేజ్​లని వినాల్సిన అవసరం ఉండదు. అవును... టెలిగ్రామ్ ప్రీమియం తీసుకున్నవాళ్లు ఇప్పుడు వాయిస్​ మెసేజ్​లను టెక్స్ట్​ మెసేజ్​లుగా మార్చొచు.  

యునిక్ స్టిక్కర్లు, రియాక్షన్లు:  

టెలిగ్రామ్​ ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ తీసుకున్న యూజర్లు దాదాపు12కు పైగా యునిక్​ స్టిక్కర్లని వాడుకోవచ్చు. వీటిలో ఫుల్​ స్క్రీన్ యానిమేషన్​ స్టిక్కర్లు కూడా ఉంటాయి. ప్రీమియం యూజర్లు వీటిని ప్రీమియం తీసుకోనివాళ్లకు పంపొచ్చు. మరో విషయం... ఈ స్టిక్కర్​ కలెక్షన్​ని ప్రతి నెలా టెలిగ్రామ్​ ఆర్టిస్ట్​లు అప్​డేట్ చేస్తుంటారు. అంతేకాదు మెసేజ్​లకు యూనిక్​ రియాక్షన్స్​ ద్వారా రిప్లయ్​ ఇవ్వొచ్చు. టెలిగ్రామ్ ప్రీమియంలో కొత్తగా10 ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి .   

చాట్​ లిస్ట్ మార్చుకోవచ్చు: 

చాట్​లిస్ట్​ని మార్చుకునేందుకు వీలుగా రెండు కొత్త ఫీచర్లు తెచ్చింది. డిఫాల్ట్​గా చాట్ ఫోల్డర్లని మార్చుకోవచ్చు. అందుకోసం చాట్​లిస్ట్​లోని డిఫాల్ట్ ఫోల్డర్​ మీద నొక్కిపడితే రీఆర్డర్ ఆప్షన్​ వస్తుంది. అప్పుడు ఆ ప్లేస్​లో ముఖ్యమైన చాట్​ని పెట్టుకోవచ్చు. అంతేకాదు ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్​​లో కొత్త చాట్​లని ఆటోమెటిక్​గా మ్యూట్ చేసే ఆప్షన్​ని ఎనేబుల్ చేయొచ్చు. 

యానిమేటెడ్ ప్రొఫైల్​ పిక్చర్:  

టెలిగ్రామ్ ప్రీమియం తీసుకున్నవాళ్ల  ప్రొఫైల్​ వీడియోలు  మిగతావాళ్లకు యానిమేటెడ్ బొమ్మల్లా కనిపిస్తాయి. చాట్​లిస్ట్​లో యూజర్ల పేరు పక్కనే ప్రీమియం స్పెషల్ బ్యాడ్జ్​ కనిపిస్తుంది. ఇది ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ తీసుకున్నారనేదానికి గుర్తు. 
 ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ తీసుకుంటే...  
యూజర్లు టెలిగ్రామ్​లో 500 గ్రూప్స్​ని యాడ్ చేయొచ్చు. దాదాపు రెండొందల ముఖ్యమైన జిఐఎఫ్​(గ్రాఫిక్ ఇంటర్​ఛేంజ్ ఫార్మాట్​)లను సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు 20కి పైగా చాట్ ఫోల్డర్స్​ని క్రియేట్ చేయొచ్చు. 4జిబి సైజ్ ఫైల్స్​ని పంపే అవకాశం ఉండడంతో ఫుల్​ హెచ్​డి సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్​ని షేర్ చేయొచ్చు.

క్రోమ్​బుక్​ని ఫోన్​కి కనెక్ట్​ చేయొచ్చు

త్వరలో క్రోమ్​బుక్​ని ఆండ్రాయిడ్ ఫోన్లకు కనెక్ట్ చేసే కొత్త ఫీచర్లు తీసుకురాబోతోంది గూగుల్. క్రోమ్ ఓఎస్ వెర్షన్103 అప్​డేట్ సాయంతో క్రోమ్​బుక్స్​ని ఆండ్రాయిడ్ ఫోన్లకు కనెక్ట్ చేయొచ్చు. అంతేకాదు ఫోన్​లో ఈమధ్య తీసిన ఫొటోల్ని, ఫోన్​హబ్​లోకి వెళ్లి తొందరగా చూడొచ్చు. దాంతో, ఇకపై కొత్తఫొటోల్ని చూసేందుకు వాటిని ఇ–మెయిల్​   లేదా గూగుల్ ఫొటోస్​లో వెతకాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నెట్ లేకున్నా కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది. అంతేకాదు  మీకు దగ్గర్లో ఉన్న, సేవ్​ చేసిన ఫోన్ వై–ఫైకి క్రోమ్​బుక్​ని కనెక్ట్ చేసే ఫీచర్ కూడా తేనుందట గూగుల్. 

గూగుల్ నెస్ట్ కెమెరా

ఈరోజుల్లో ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ కెమెరాలు పెట్టుకుంటున్నారు చాలామంది. గూగుల్​ సంస్థ కూడా సెక్యూరిటీ  కెమెరాల్ని తీసుకొచ్చింది. ‘గూగుల్ నెస్ట్’​ పేరుతో పిలిచే ఈ కెమెరాలు ఇప్పుడు మనదేశంలోకి వచ్చేశాయి.  టాటా ప్లే సంస్థతో కలిసి వీటిని తెచ్చింది గూగుల్. ఇవి టాటా ప్లే శాటిలైట్ ప్లాట్​ఫామ్​ సాయంతో పనిచేస్తాయి. వీటిలో బ్యాటరీ ఉంటుంది. ఇంటికి దగ్గరగా జంతువులు, వాహనాలు, మనుషులు వస్తే అలర్ట్​ చేస్తుంది. లైవ్ వీడియోని 1080 పిక్సెల్, హెచ్​డిలో చూపిస్తుంది. ఈ కెమెరాలోని 2 మెగా పిక్సెల్ సెన్సర్​ 130 డిగ్రీలు తిరుగుతుంది. వీటి ధర రూ. 11,999. టాటా ప్లే సెక్యూరిటీ ప్లస్ ప్లాన్ తీసుకున్నవాళ్లకు ఈ కెమెరాతో పాటు రూ. 4500 విలువైన  గూగుల్ నెస్ట్​ మినీ కెమెరా, రెండు నెలలు నెస్ట్ అవేర్ సబ్​స్క్రిప్షన్ ఉచితం.  

ట్విట్టర్​ నోట్స్

ట్విట్టర్​ త్వరలోనే ‘నోట్స్​’ అనే కొత్త ఫీచర్​ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ వస్తే, యూజర్లు  వ్యాసం గురించిన రైటప్స్​ని లింక్స్ లాగా పంపించొచ్చు. ‘రైట్’ ఆప్షన్​ ద్వారా యూజర్లు ఈ కొత్త ఫీచర్​ని ఉపయోగించొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా అనౌన్స్ చేయలేదు. 

ఇన్​స్టాగ్రామ్​లో ఏజ్​ వెరిఫికేషన్

ఇన్​స్టాగ్రామ్​ త్వరలోనే  ఏజ్​ వెరిఫికేషన్ ఫీచర్​ తీసుకురాబోతోంది. తక్కువ టైంలోనే యూజర్ల వయసుని నిర్థారించేందుకు  రెండు పద్ధతుల్ని ఎంచుకుంది ఇన్​స్టా. వాటిలో మొదటిది వీడియో సెల్ఫీ. రెండోది  సోషల్ వౌచింగ్. వీడియో సెల్ఫీ తీసేటప్పుడు యూజర్లు కొన్ని ఇన్​స్ట్రక్షన్స్ పాటించాలి. ఈ వీడియో సెల్ఫీని ‘యొటి’ అనే కంపెనీకి షేర్​ చేస్తుంది ఇన్​స్టాగ్రామ్. ఆ వీడియోలో యూజర్ల ఫేషియల్ ఎక్స్​ప్రెషన్స్​ని బాగా గమనించి యూజర్ల వయసుని నిర్థారిస్తుంది ఈ కంపెనీ. అందుకు 20 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత ఈ వీడియో ఆటోమెటిక్​గా డిలీట్ అవుతుంది. సోషల్ వౌచింగ్​ పద్ధతిలో మీకు తెలిసిన ముగ్గురు  మీ సరైన వయసుని చెప్తారు. అయితే ఆ ముగ్గురికి  కనీసం18 ఏండ్లు ఉండాలి.  అంతేకాదు మూడు రోజుల్లో  వాళ్లు  ‘ఏజ్ వెరిఫికేషన్​’ రిక్వెస్ట్​కు రిప్లయ్​ ఇవ్వాలి.