
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ లోని నైస్ సిటీ చర్చిలో ఉగ్రవాది చేతిలో హత్యకు గురైన మహిళ చివరి మాటలు అక్కడి జనాలను కంటతడి పెట్టించాయి. పరుగెత్తలేక ఓ రెస్టారెంట్దగ్గర కుప్పకూలిపోయిన ఆమె.. అక్కడున్న వారితో ‘టెల్మై చిల్డ్రన్.. ఐ లవ్ దెమ్ (నా పిల్లలకు చెప్పండి.. వాళ్లను ప్రేమిస్తున్నానని)’ అంటూ ప్రాణాలు వదిలిందని స్థానిక మీడియా వెల్లడించింది. సౌత్నైస్ సిటీలోని నాట్రిడేమ్ చర్చిలో గురువారం పొద్దున ఓ దుండగుడు కత్తితో 60 ఏండ్ల మహిళ, 55 ఏండ్ల చర్చి ఉద్యోగి, 44 ఏండ్ల బ్రెజిల్ మహిళపై దాడి చేశాడు. 60 ఏండ్ల మహిళ, 55 ఏండ్ల ఉద్యోగి అక్కడికక్కడే మరణించగా బ్రెజిల్ మహిళ రక్తమోడుతున్న గాయాలతోనే పరుగెత్తింది. ఓ రెస్టార్టెంట్ దగ్గరకు చేరుకుంది. అక్కడున్న వారితో ‘నా పిల్లలకు చెప్పండి.. వాళ్లను ప్రేమిస్తున్నానని’ అంటూ ప్రాణాలు విడిచింది. ‘పారిపోండి. ఎవరో జనాలను పొడిచేస్తున్నాడు’ అంటూ పక్కవాళ్లను అప్రమత్తం చేసిందని అధికారులు చెప్పారు.