కరోనాపై నిజాలు చెప్పండి.. చైనాకు డబ్ల్యూహెచ్​వో సూచన

కరోనాపై నిజాలు చెప్పండి.. చైనాకు డబ్ల్యూహెచ్​వో సూచన

యునైటెడ్ నేషన్స్/జెనీవా: కరోనా కేసుల నమోదుపై వాస్తవాలు వెల్లడించాలని చైనాకు వరల్డ్ హెల్త్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూహెచ్​వో) సూచించింది. కఠినమైన ‘‘జీరో కొవిడ్ పాలసీ’’ సడలించడంతో చైనా నేషనల్ హెల్త్ కమిషన్, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్‌‌లోని ఉన్నతాధికారులతో డబ్ల్యూహెచ్​వో ప్రతినిధులు సమావేశమయ్యారు. చైనాలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్షించారు. కరోనా విషయంలో తప్పుడు లెక్కలు ఇవ్వొద్దని డబ్ల్యూహెచ్​వో సూచించింది. అబద్ధాలు ప్రచారం చేయడంతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. వైరస్ వ్యాప్తికి సంబంధించిన వివరాలు, జెనిటిక్​ సీక్వెన్సింగ్, కరోనాతో హాస్పిటల్స్​తో చేరిన వాళ్ల సంఖ్య, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వాళ్లు ఎంతమంది, కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ లెక్కలు.. తదితర వివరాలను ప్రపంచానికి వెల్లడించాలని కోరింది. 

వైరస్​ వేరియంట్లతో పాటు రోగులకు అందిస్తున్న ట్రీట్​మెంట్, వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు చెప్పాలని సూచించింది. ముఖ్యంగా 60ఏండ్లు పైబడిన రోగుల పరిస్థితేంటో వివరించాలని తెలిపింది. వైరల్ సీక్వెన్సింగ్, క్లినికల్ మేనేజ్‌‌మెంట్, ఇంపాక్ట్ అసెస్‌‌మెంట్‌‌ను బలోపేతం చేయాలని సూచించింది. కరోనాకు సంబంధించి డబ్ల్యూహెచ్​వో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో కలిసి పనిచేయాలంటూ చైనా సైంటిస్టులను కోరింది. నెగిటివ్​ రిపోర్ట్​ తప్పనిసరి: ఈయూ దేశాలు చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో యూరోపియన్​ దేశాలు అలర్ట్ అయ్యాయి. చైనా నుంచి వచ్చేటోళ్లు కరోనా నెగిటివ్​ రిపోర్ట్​ తీసుకురావాల్సిందేనని ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్​ దేశాలు ఆంక్షలు విధించాయి.