గద్దర్​ విగ్రహావిష్కరణ కోసం తెల్లాపూర్ కౌన్సిలర్ ఆమరణ నిరాహార దీక్ష

గద్దర్​ విగ్రహావిష్కరణ కోసం తెల్లాపూర్  కౌన్సిలర్  ఆమరణ నిరాహార దీక్ష

రామచంద్రాపురం, వెలుగు : గద్దర్​ విగ్రహావిష్కరణ కోసం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​ మున్సిపాలిటీలో కౌన్సిలర్  కొల్లూరి భరత్  ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈనెల 31న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేయాల్సి ఉండగా విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందని అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ కౌన్సిలర్  భరత్​ శనివారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు వివిధ పార్టీలు, యూనియన్ల నాయకులు, హెచ్​సీయూ స్టూడెంట్లు, పీఎస్టీయూ స్టూడెంట్​ సంఘాల నేతలు, గ్రామస్తులు సంఘీభావం తెలుపుతూ దీక్ష శిబిరంలో కూర్చున్నారు.

ఈ సందర్ఛంగా భరత్​ మాట్లాడుతూ.. గతంలో తెల్లాపూర్​లో గద్దర్​ సంస్మరణ సభ నిర్వహించినపుడు విగ్రహ ఏర్పాటు అంశాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లామని, దానికి అనుగుణంగా మున్సిపల్​ కౌన్సిల్​లో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశామని పేర్కొన్నారు. తాజాగా హెచ్ఎండీఏ అధికారులు ఉద్దేశపూర్వకంగానే అనుమతుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పోలీసులు తమ వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 31 న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా గద్దర్​ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే వరకు దీక్షను ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.