
హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నారాయణ దాస్ కె నారంగ్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఏషియన్ మల్టీ ప్లెక్స్ మరియు ఏషియన్ థియేటర్స్ అధినేత గా వున్న నారంగ్ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో లవ్ స్టొరీ, లక్ష్య తదితర సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున సినిమా ఘోస్ట్, ధనుష్ తో మరో సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత గా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సినీ పరిశ్రమకు సేవ లందించిన నారాయణ దాస్ కె నారంగ్ మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంగి వ్యక్తం చేసింది.
నారంగ్ కుమారులు కూడా నిర్మాతలే
నారాయణ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. ఆయన డిస్ట్రిబూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేశారు. నిర్మాతగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియర్ గ్రూప్ అధినేత గ్లోబల్ సినిమా స్థాపకుడు, ఫైనాన్సియర్‌కూడా ఆయిన ఆయన తెలుగు చలనచిత్రరంగంలో మంచి పేరు సంపాదించారు. తెలంగాణలో సినిమాల పంపిణీదారునిగా ఆయన మంచి పేరు పొందారు. ఆయన మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ వాణిజ్యమండలి తమ ప్రగాఢసానుభూతి తెలియజేసింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే.
నారాయణ దాస్ నారంగ్ భౌతికాయాన్ని ఆస్పత్రి నుంచి మరో గంటలో వారి ఇంటికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 4గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
ట్విట్టర్లో మరోసారి కేంద్రంపై కేటీఆర్ విమర్శలు