అది వారి ఆక్రోశం.. సినీ పరిశ్రమకు సంబంధం లేదు

అది వారి ఆక్రోశం.. సినీ పరిశ్రమకు సంబంధం లేదు
  • సినీ వివాదంపై స్పందించిన తెలుగు ఫిల్మ్ చాంబర్

హైదరాబాద్: తెలుగు చలనచిత్ర రంగంలో వాడీవేడీ కామెంట్స్.. ఏపీ ప్రభుత్వ అమాత్యుల విమర్శల నేపధ్యంలో వివాదంపై తెలుగు ఫిలిమ్ ఛాంబర్ స్పందించింది. కొందరు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కారని.. వారి వ్యాఖ్యలతో సినీ పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. కొంతమంది తమ అభిప్రాయాలను, ఆక్రోశాన్ని వెల్లడించారు,  అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయాలుగా చూడకూడదని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తోంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమేనని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాల నుంచి ఎప్పుడూ ఇండస్ట్రీకి సహకారం అందుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల సహకారం లేకుండా మేం మనుగడ సాగించలేమని తెలిపారు. సినీ పరిశ్రమపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నాయని, ఇలాంటి సమయంలో మాకు నేతలు,  ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం అని వివరించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లు వంటి వారని ఆయన పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి వారి ఆశీస్సులు, మద్దతును కొనసాగించాలని కోరుకుంటున్నామని నారాయణదాస్ నారంగ్ స్పష్టం చేశారు.