మాలిలో తెలుగు వ్యక్తి కిడ్నాప్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

 మాలిలో తెలుగు వ్యక్తి కిడ్నాప్..  ఆందోళనలో కుటుంబ సభ్యులు

మిర్యాలగూడ,వెలుగు: వెస్ట్ ఆఫ్రికా  మాలి లోని డైమం డ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి  అమర లింగేశ్వరరావును ఉగ్రవాదులు ఈ నెల 1న కిడ్నాప్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడుగుకు చెందిన అమర లింగేశ్వరరావుకు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన రమణతో కొన్నేండ్ల కింద పెండ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అమర లింగేశ్వరరావు చాలా కాలంగా వెస్ట్ ఆఫ్రికాలోని  డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్​గా పనిచేస్తున్నాడు. 

ఈ నెల 1న అల్​ ఖాయిదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లీమీన్ (జేఎన్ఎం) టెర్రరిస్టులు డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. అమరలింగేశ్వరరావు సహా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న పలువురిని  కిడ్నాప్ చేశారు.  అమర లింగేశ్వరరావు కిడ్నాప్​ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది క్రితం వరకు మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ లో నివసించిన ఆయన కుటుంబ సభ్యులు  ప్రస్తుతం హైదరాబాద్​లో నివసిస్తున్నారు. బాధితుడిని క్షేమంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.