55 ఏండ్ల తర్వాత సీజేఐగా తెలుగు వ్యక్తి

55 ఏండ్ల తర్వాత సీజేఐగా తెలుగు వ్యక్తి
  • ఇయ్యాల ప్రమాణం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ
  • ఏపీలోని పొన్నవరంలో జస్టిస్​ రమణ జననం
  • ఎన్నో కష్టానష్టాలను దాటుకుని సీజేఐ స్థాయికి
  • అయోధ్య రామమందిరంపై కీలక తీర్పులో భాగస్వామ్యం

సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్.వి.రమణ శనివారం ప్రమాణం చేయనున్నారు. జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే శుక్రవారం రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లోని అశోక హాల్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దీపక్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగస్టు 27న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న లాయర్ గా ఎన్ రోల్ అయ్యారు. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టుకు జడ్జిగా అపాయింట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 2022 ఆగస్టు 26 వరకు పదవిలో కొనసాగనున్నారు.
 

హైదరాబాద్​, వెలుగు: దాదాపు 55 ఏళ్ల తర్వాత ఓ తెలుగు వ్యక్తి సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్​గా బాధ్యతలు చేపట్టపోతున్నారు. అంతకుముందు 1966లో ఏపీలోని రాజమండ్రికి చెందిన జస్టిస్​ కోకా సుబ్బారావు 9వ సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ ఇన్నాళ్లకు జస్టిస్​ ఎన్వీ రమణ సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు. 48వ సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్న ఆయన.. ఆ ఘనత సాధించిన రెండో తెలుగు వ్యక్తిగా నిలిచారు. స్వయం కృషి, పట్టుదల, ఎదిగినకొద్దీ ఒదిగే తత్వం వంటి కారణాలతోనే ఆయన సీజేఐ స్థాయికి ఎదిగారు. ఏపీలోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో నూతలపాటి సరోజినీ దేవి- గణపతి రావు దంపతులకు 1957 ఆగస్టు 27న ఆయన జన్మించారు. కంచికర్లలో ప్రాథమిక విద్య, అమరావతిలో ఇంటర్​, 1982లో ధరణికోట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు కుమార్తెలన్నారు.

1983లో లాయర్​గా కెరీర్​ మొదలు
చదువుకుంటూనే విజయవాడలో కొద్దిరోజుల పాటు జర్నలిస్ట్​గా పనిచేసిన జస్టిస్​ ఎన్వీ రమణ.. 1983 ఫిబ్రవరి 10న లాయర్​గా కెరీర్​ ప్రారంభించారు. తర్వాత సీనియర్​ లాయర్​ ఏరాసు అయ్యపురెడ్డి దగ్గర పదేండ్ల పాటు జూనియర్​గా చేశారు. లాయర్​గా అన్ని స్థాయి కోర్టుల్లోనూ అన్ని రకాల కేసులనూ వాదించారు. చంద్రబాబు నాయుడు హయాంలో 1998లో అదనపు ఏజీగా చేశారు. 2000 జూన్​ 27న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత హైకోర్టు తాత్కాలిక చీఫ్​ జస్టిస్​గా కూడా పని చేశారు. 2013 సెప్టెంబర్​ 2న ఢిల్లీ హైకోర్టుకు చీఫ్​ జస్టిస్​గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఏడాది ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్​ పొందారు. శనివారం (ఏప్రిల్​ 24) సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్​గా ప్రమాణం చేయబోతున్నారు. 2022 ఆగస్టు 26 వరకు 16 నెలల పాటు ఆయన సీజేఐగా సేవలందిస్తారు. జస్టిస్​ ఎస్​హెచ్​ కపాడియా తర్వాత ఎక్కువ కాలం సేవలందించబోతున్న సీజేఐ ఎన్వీ రమణే కావడం విశేషం. జస్టిస్​ కపాడియా 2 ఏండ్ల నాలుగు నెలల (28 నెలలు) పాటు సీజేఐగా కొనసాగారు.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరు
కాలేజీ రోజుల్లో స్టూడెంట్​ లీడర్​గానూ జస్టిస్​ ఎన్వీ రమణ ఎన్నో పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆ సమయంలోనే ఏడాది పాటు చదువుకు దూరమయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత డిగ్రీ, ఆ తర్వాత లా పూర్తి చేశారు. రాజకీయంగా ఆయన మంచి స్థితికి చేరుకుంటారని అంతా భావించినా.. లాయర్​గా కెరీర్​ను మొదలుపెట్టి సీజేఐ స్థాయికి చేరారు. 

తెలుగంటే ప్రేమ
తెలుగు భాష అంటే జస్టిస్​ ఎన్వీ రమణకు ప్రాణం. ఢిల్లీలోని తన ఇంటికి ఇంగ్లిష్​తోపాటు తెలుగులోనూ నేమ్​ప్లేట్​ పెట్టుకున్నారంటేనే ఆయనకు తెలుగంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. మాతృభాషలో చదివితేనే ఎవరైనా ఉన్నతస్థానానికి ఎదుగుతారని ఆయన చెబుతారు.హైకోర్టు జడ్జిగా ఉన్న టైంలో అధికార భాషా సంఘం సమన్వయంతో న్యాయ సదస్సును నిర్వహించారు. మాతృభాష తర్వాతే ఇంగ్లిష్​, హిందీ వంటిని నేర్చుకుంటే ఉపయోగం ఉంటుందంటారు. ఇంగ్లిష్​ వస్తేనే వృద్ధిలోకి వస్తామన్న మాటలను ఆయన అస్సలు ఒప్పుకోరు.  ఎన్నో అడ్డంకులు, అవరోధాలను దాటుకుని ఆ పదవి చేపడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పలు ఫిర్యాదులు సుప్రీం కోర్టుకు చేరాయి. అయితే, వాటన్నింటినీ తోసిపుచ్చిన చీఫ్​ జస్టిస్​ ఎస్​ఏ బాబ్డే.. తర్వాతి సీజేఐగా జస్టిస్​ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించారు. దానికి కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి కూడా ఆయన నియామకాన్ని ఓకే చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

కీలక తీర్పులు 
రాజకీయ నేతలపై కేసులను త్వరగా విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనంలో జస్టిస్​ ఎన్వీ రమణ కూడా ఉన్నారు. జమ్మూ-కాశ్మీర్​లో 370 ఆర్టికల్​ రద్దు నేపథ్యంలో ఆంక్షల విధింపు వంటి కీలక ఉత్తర్వులు వెలువరించారు. అయోధ్య వివాదాస్పద స్థలంపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలోనూ ఉన్నారు. రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేస్తే సరిపోదని కర్నాటక కేసులో చెప్పారు. కుటుంబంలో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే వారితో పాటే గృహిణులకూ సమాన హోదా ఉండాలని, గృహిణి సేవలను గుర్తించాలని కీలక తీర్పులు చెప్పారు. ఇలాంటివి 155 తీర్పుల వరకు చెప్పారు.