రూ. కోట్లలో పందేలు!..తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జాతర

రూ. కోట్లలో పందేలు!..తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జాతర
  •   ఆంధ్రాకు భారీగా తరలిన తెలంగాణవాసులు
  •   వీరిలో ఎమ్మెల్యేలు, నేతలు, రియల్ వ్యాపారులు
  •  రూ. లక్షల నుంచి రూ. కోట్లలో పందేలు  
  • సంక్రాంతి ముగియడంతో తిరుగు పయనం

ఖమ్మం, వెలుగు: సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు జిల్లాల్లో జరిగిన కోళ్ల పందేలకు తెలంగాణవాసులు  భారీగా తరలివెళ్లారు. రాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఏపీకి చెందిన ఉమ్మడి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ, హైదరాబాద్​నుంచి వందలాది కార్లలో వేలాదిమంది తరలివెళ్లారు. 

ఏపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొని రూ.లక్షల నుంచి రూ.కోట్లలో పందేలు కాశారు. 

హైదరాబాద్​నుంచి వచ్చిన కార్లు ఖమ్మం మీదుగా వైరా వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి ఎక్కి, అక్కడి నుంచి మర్లపాడు మీదుగా ఏపీలోని విస్సన్నపేట, చింతలపూడి, మీర్జాపూర్​, భీమవరం, ఏలూరు  ప్రాంతాలకు వెళ్లాయి. మూడు రోజుల పాటు జరిగిన కోళ్ల పందేలు ముగియడంతో శుక్రవారం సాయంత్రం నుంచి సొంతూళ్లకు తిరుగు పయనం అయ్యారు.  

జాతరను తలపించగా.. 

తెలంగాణను నుంచి వెళ్లివారితో కోడి పందేల ప్రాంతాలు జాతరను తలపించాయి. ఏపీలోని తిరువూరు, తోకపల్లి, కోకిలంపాడు, చింతంపల్లి, సీతానగరం, పుట్రేల, తాతకుంట్ల , కాకర్ల ప్రాంతాల్లోని మామిడి, కొబ్బరి, పామాయిల్ తోటల్లో ప్రత్యేక టెంట్లు వేశారు. ఏసీలు ఏర్పాటు చేశారు. 

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం శివారు ఆంధ్ర సరిహద్దు ఎన్టీఆర్​జిల్లా తిరువూరుకు రాష్ట్రం నుంచి పందెం రాయుళ్లు పోటెత్తారు. పార్కింగ్ లో అన్ని వాహనాలు తెలంగాణ నుంచి వచ్చినవే కనిపించాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఏపీలోని విసన్నపేటలోని తాతకుంట్లలో సినిమా సెట్టింగ్స్ ను తలపించేలా పందెం బరులు, భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 

కోడి పందాలు చూడటానికి మహిళలు సైతం భారీగా తరలివచ్చారు. పురుషులతో పాటు కోడి పందాలే కాకుండా నంబర్ల ఆట, అందర్​బాహర్​, గుండాట, ఎరుపు నలుపు ఆటల్లో పాల్గొని పందేలు కాశారు.  భీమవరంలో జరిగిన ఒక పందెంలో గుడివాడకు చెందిన రాజేశ్​ రూ.కోటిన్నర గెల్చుకున్నారు. కోడి పందేలు  నగదుగానే జరిగాయి. 

క్యాష్ లేనివారి కోసం ఫోన్​పే, గూగుల్ పే ద్వారా ట్రాన్స్​ఫర్​చేసి కమిషన్​కట్ చేసుకొని కొందరు నగదు అందించారు. క్రెడిట్ కార్డు ద్వారా స్వైప్​ చేస్తే కూడా నగదు తీసుకునేందుకు చాలామంది పందెం రాయుళ్లు పోటీపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు చూసేందుకు లోపలికి వెళ్లేందుకు రూ.500 నుంచి రూ.1000 చొప్పున ఎంట్రీ ఫీజు వసూలు చేశారు.