దేశవ్యాప్తంగా విద్యుత్‌కు పెరిగిన డిమాండ్
బొగ్గు కొరతతో ఇబ్బందులు పడుతున్న పలు రాష్ట్రాలు
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూరీడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా చాలామంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు.
ఇటు తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనం కాలు బయట పెట్టడానికి భయపడుతున్నారు. వడగాల్పులతో భయాందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు వడదెబ్బతో మృతి చెందారు. మరోరెండు రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నల్గొండ, మెదక్, ఖమ్మం, హైదరాబాద్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఢిల్లీ, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా విద్యుత్‌కు పెరిగిన డిమాండ్
ఈ సీజన్‌లో ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఓ పక్క ఉక్కపోత, మరోపక్క బొగ్గు కొరతతో రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ అవసరాలు తీర్చలేక చాలా రాష్ట్రాలు 2 నుంచి 8 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నాయి. మార్చిలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏప్రిల్‌లో కూడా ఆ పరిస్థితి కొనసాగింది. దీంతో దేశంలో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరుకుంది. దేశంలో 70 శాతం విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు అయిన బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడింది. చాలా రాష్ట్రాలు బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
