పూజారులు పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు : చంపుతామంటూ దేవుడి ఎదుట బెదిరింపులు

పూజారులు పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు  : చంపుతామంటూ దేవుడి ఎదుట బెదిరింపులు

తమిళనాడు రాష్ట్రంలో పూజారులు కొట్టుకున్నారు.. పరిగెత్తి పరిగెత్తి మరీ కొట్టుకున్నారు.. అంతటితో ఆగలేదు.. రేయ్ చంపేస్తాం.. మిమ్మల్ని చంపేస్తాం.. మీ అంతు చూస్తాం అంటూ దేవుడి ఎదుటే శపథాలు చేశారు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ పూజారుల కొట్లాట.. బెదిరింపులు.. తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

అది తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయం. 108 వైష్ణవ ఆలయాల్లో ఒకటి. అతి పురాతన ఆలయంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆలయం ఇది. ఈ ఆలయంలోనే పూజారులు కొట్టుకున్నారు.. చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. కారణాల్లోకి వెళితే.. ప్రతి ఏటా కనుమ పండుగ రోజు.. వరదరాజ పెరుమాళ్ల స్వామి విహార యాత్రకు వెళతారు. ఆలయం నుంచి బయలుదేరే స్వామి.. ముత్యాలపేట, అయ్యన్ పేట, కురుకుపేట, తిమ్మరాజంపేట, కిలిఒట్టివాక్కం, వెంగుడి, వాలాజాబాద్, పుల్యంబాక్కం గ్రామాల మీదుగా ఊరేగుతూ.. పళశివరం గ్రామంలోని కొండపైకి చేరుకుంటారు. నిత్యం గుడిలో ఉండే స్వామి.. భక్తుల దగ్గరకే వెళ్లటం అనే ఆచారంలో భాగంగా.. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు.. పార్వేట ఉత్సవం పేరుతో ఈ ఊరేగింపు ఉంటుంది. లక్షల మంది భక్తులతోపాటు.. పూజారులు అందరూ ఈ వేడుకకు హాజరవుతారు.

 సారి కూడా పార్వేట ఉత్సవానికి బయలుదేరిన వరదరాజ పెరుమాళ్ స్వామికి.. పూజారులు పాటలు పాడటం ఆనవాయితీ. ఇందులో భాగంగా మొదట ఎవరు పాట పాడాలి అనే విషయంలో పూజారుల మధ్య వివాదం తలెత్తింది. అయ్యంగార్లలోని రెండు వర్గాలు.. మేం ముందు పాట పాడాలి అంటే మేం ముందు పాట పాడాలి.. మా సంప్రదాయం ప్రకారం వేడుక జరగాలి అని పట్టుబట్టారు.  అయ్యంగార్లలోని రెండు వర్గాల్లోని పూజారులు పంతానికి వెళ్లారు. ఈ విషయంలో రెండు వర్గాల పూజారుల మధ్య వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత కొట్టుకున్నారు. పరిగెత్తి పరిగెత్తి కొట్టుకున్నారు పూజారులు. తొక్కిసలాట జరిగింది. ఓ వర్గం పూజారుల దాడితో.. మరో వర్గం పూజారులు కొందరు అక్కడి నుంచి పరిగెత్తటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. రెండు వర్గాలు తెగబడి.. చంపుతాం.. చంపేస్తాం అంటూ దేవుడి ఎదుటే బెదిరింపులకు దిగటంతో.. వేడుక చూడటానికి వచ్చిన భక్తులు షాక్ అయ్యారు. అయ్యవార్లకే ఇంత కోపమా.. ఈ శపథాలు ఏంటీ అంటూ నోరెళ్లబెట్టారు. 

మొత్తానికి భక్తులు, అధికారులు, పోలీసులు కలగజేసుకుని.. వివాదాన్ని తాత్కాలికంగా ముగింపు పలికి.. వేడుక నిర్వహించారు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. కొన్నేళ్లుగా ఈ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి కూడా..