జాబ్స్ స్పెషల్..భూగరిష్ట పరిమితి చట్టాలు

జాబ్స్ స్పెషల్..భూగరిష్ట పరిమితి చట్టాలు

భూస్వాముల చేతిలో గరిష్ట భూమి కేంద్రీకృతం కావడంతో సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సాంఘిక పీడనలు, అన్యాయాలు పెరిగాయి. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని తీసుకురావడం కోసం భూకమతాల గరిష్ట పరిమితులు విధించారు. భూ వికేంద్రీకరణపై గరిష్ట పరిమితిని నిర్ణయించగా మిగిలిన భూములను భూమి లేని వారికి పున: పంపిణీ చేయవచ్చు. భూ సంస్కరణలన్నింటిలోనూ అత్యంత ప్రధానమైంది భూకమతాల గరిష్ట పరిమితి నిర్ణయించడం. భూగరిష్ట పరిమితి చట్టం ఒక కుటుంబం ఎంత పరిమాణంలో భూమిని తన యాజమాన్యంలో ఉంచుకోవచ్చనేది నిర్ణయిస్తుంది. ఈ చట్టానికి కుటుంబం ఒక యూనిట్​గా ఉంటుంది. 

భూగరిష్ట పరిమితి చట్టం- 1955

హైదరాబాద్​ రాష్ట్రంలో కౌలు సంస్కరణల చట్టం అనేది భూగరిష్ట పరిమితి చట్టం – 1955గా అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏడాదికి రూ.1200 నికర ఆదాయం లభించే కమతం కుటుంబ కమతంగా నిర్ణయించారు. సుమారు నాలుగు కుటుంబ కమతాలు కుటుంబ గరిష్ట పరిమితిగా నిర్ణయించి తొలుత ఖమ్మంలో అమలు చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భూస్వాములు కోర్టును ఆశ్రయించడంతో అమలు నిలిచిపోయింది. 

 కమతాల సమీకరణ చట్టం- 1956

విఘటన చెందిన కమతాలను (చిన్న, చిన్న కమతాల) ఒక పెద్ద కమతంగా సేకరించడమే కమత సమీకరణ అంటారు. కమతాల సమీకరణ ద్వారా చిన్న కమతాల వల్ల ఏర్పడే సమస్యలను పరిష్కరించవచ్చు. తెలంగాణ కౌలు భూముల చట్టం (1950)లో విఘటన నిరోధానికి, కమతాల సమీకరణకు కొంత ప్రాధాన్యత ఇచ్చారు. 1956లో కమతాల సమీకరణకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్​ (తెలంగాణ ప్రాంత) విఘటన నిరోధక కమతాల సమీకరణ చట్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కనిష్ట కమతాలను తాకట్టు పెట్టుకోవడానికి (ప్రభుత్వం, బ్యాంకు, సహకార సంఘాలు), కౌలుకు ఇవ్వడానికి అవకాశం వచ్చింది. ఈ చట్టం అమలైనట్లు ఎక్కడా పేర్కొనలేదు. అంటే ఈ చట్టం పుస్తకాలకే పరిమితమైంది. దీనిద్వారా కమతాలను పున: పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి హక్కు కల్పించారు. కనిష్ట కమతాల నిర్ణయంతోపాటు వాటిని తిరిగి పున: విభజన జరగకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. 

భూగరిష్ట పరిమితి చట్టం- 1961

ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి సంవత్సరానికి రూ.3,600 నికర ఆదాయం లభించే భూ పరిమాణాన్ని గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. దీని ప్రకారం కనిష్ట భూమి ఆరెకరాలు, గరిష్ట భూమి 324 ఎకరాలు. 

ఎ. మాగాణి భూమి వర్గీకరణ: ఈ చట్టం ప్రకారం మొత్తం మాగాణి భూమిని ఎ, బి, సి, డి, ఈ అని ఐదు రకాలుగా విభజించారు. రెండు పంటలు పండే భూమి గరిష్ట పరిమితి ఆరెకరాల నుంచి 24 ఎకరాలుగా నిర్ణయించారు. ఒక పంట అయితే 27 ఎకరాల నుంచి 108 ఎకరాలుగా గరిష్ట పరిమితి నిర్ణయించారు. బి. మెట్టభూమి వర్గీకరణ: మెట్ట భూమిని ఎఫ్​, జీ, హెచ్​ అని మూడు రకాలుగా విభజించారు. రెండు పంటలు పండే భూమి గరిష్ట పరిమితి 324 ఎ కరాల నుంచి 72 ఎకరాలుగా నిర్ణయించారు. ఒక పంటే అయితే 162 ఎకరాల నుంచి 324 ఎకరాలుగా నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం కుటుంబ యూనిట్​ గరిష్ట పరిమితి ఐదుగురు సభ్యులు. కుటుంబ సభ్యులు ఐదుగురు కంటే ఎక్కువగా ఉంటే అదనపు భూమి 72 ఎకరాలు కేటాయించుకొని నిర్ధారించారు. 

భూమి హక్కుల రికార్డు చట్టం- 1971 

ఈ చట్టం పూర్తి పేరు ఆంధ్రప్రదేశ్​ రికార్డ్​ ఆఫ్​ రైట్స్​ ఇన్ లాండ్​ పట్టాదార్​ పాస్​బుక్స్​ యాక్ట్​ –1971. భూ సంస్కరణల అమలులో అతి ముఖ్యమైన సాధనం భూమిపై ఉన్న హక్కులను తెలియజేసే ప్రభుత్వ లిఖిత పూర్వక దస్తావేజు. భూ సంస్కరణలను ప్రధాన అడ్డంకిగా పిలిచే (రికార్డ్​ ఆఫ్​ రైట్స్​) భూమిపై ఉన్న హక్కులను తయారు చేయడానికి ఈ చట్టాన్ని 1971లో తీసుకొచ్చారు. దీనిద్వారా భూ సరిహద్దులపై రైతుల మధ్య వివాదాలు లేకుండా పోయింది. ఈ చట్టం ప్రకారం పాస్​బుక్​ ఇచ్చే పద్ధతి 1980 నుంచి ప్రారంభమైంది. 

ఏపీ  అసైన్డ్​ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ, ఇండ్లకు సంబంధించిన భూమిని పేదలకు పంపిణీ చేస్తే దానిని ప్రభుత్వ అసైన్డ్​ భూమి అంటారు. అసైన్​మెంట్​ అంటే భూమిని సంక్రమింపజేసే ప్రక్రియ. ఇందుకోసం ఇచ్చే పట్టాను డీపట్టా, డీఫారమ్​ అంటారు. భూగరిష్ట పరిమితి సవరణ చట్టం – 1977 ప్రకారం స్వాధీనం చేసుకున్న మిగులు భూమిని మూడు నెలల్లో పేదలకు పంచాలి. 

  •     అసైన్డ్​ భూములను పేదలు ఇతరులకు విక్రయించడం, తాకట్టు పెట్టడం, కౌలుకు ఇవ్వడం, బహుమతిగా ఇవ్వడం వంటివి చేయరాదు. ఈ ప్రక్రియనే అన్యాక్రాంతం చేయడం అంటారు. 
  •     ప్రభుత్వానికి బ్యాంకులకు రుణాలు తీసుకునేటప్పుడు తాకట్టు పెట్టవద్దు. ఈ భూములను మరో పేద రైతుకు ప్రతిఫల పూర్వకంగా విక్రయించవచ్చు.
  •    ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.2007లో చేసిన చట్ట సవరణ ప్రకారం అసైన్డ్​ భూములను మూడు నెలలలోపు పంచాల్సిన అవసరం లేదు. కోనేరు రంగారావు కమిటీ అసైన్డ్​ భూములను రెండు నెలల్లోనే పంచాలని తేల్చింది. 

అసైన్డ్​ భూములపై కేబినెట్​ సబ్​ కమిటీ: 

 
తెలంగాణ రాష్ట్రంలో అసైన్డ్​ భూముల సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. 

చైర్మన్​: ఉప ముఖ్యమంత్రి మహమూద్​ అలీ

సభ్యులు: పోచారం శ్రీనివాస్​ రెడ్డి, హరీష్​రావు, జగదీశ్​రెడ్డి, కేటీఆర్​, ఇంద్రకరణ్​రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. 

పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం- 1976

ఈ చట్టం ప్రకారం నగరాల ప్రాధాన్యత ఆధారంగా వీటిని నాలుగు రకాలుగా వర్గీకరించారు. క్లాస్​ ఏ పట్టణం 500 చ.మి., క్లాస్​–బి 1000 చ.మి., క్లాస్​ సి 1500 చ.మి., క్లాస్​ డి 2000 చ.మి. ఈ పరిమితి కంటే అదనంగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకొని నష్టపరిహారం చెల్లిస్తారు. ఎ , బి రకానికి  ప్రతి చ.మి.కు రూ.10, సి,డి రకానికి రూ.5 చొప్పున చెల్లిస్తారు. కోల్పోయిన భూమి నుంచి వార్షిక ఆదాయం వస్తుంటే దానికి 8.5 రెట్ల డబ్బు చెల్లిస్తారు. గరిష్టం మాత్రం రూ.2లక్షలకు మించరాదు. ఆర్థిక సంస్కరణ తర్వాత పారిశ్రామికీకరణ విభజన వల్ల వీటిని రద్దు చేయాలని డిమాండ్​ బాగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఈ చట్టాన్ని రద్దు చేశారు.  

వెలుగు, ఎడ్యుకేషన్​ డెస్క్​

 భూ గరిష్ట పరిమితి చట్టం - 1973 

ఈ చట్టం కేంద్రం సిఫారసుల మేరకు 1972 సెప్టెంబర్​లో శాసనసభ ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి 1973 జనవరి 1న ఆమోదముద్ర వేయడంతో చట్టంగా మారింది. ఇది అప్పటి జై ఆంధ్ర ఉద్యమం వల్ల వాయిదా పడి 1975 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. 1974లో 34వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయసమీక్ష పరిధి నుంచి మినహాయించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో చేర్చారు.  

 

  • భూగరిష్ట పరిమితి నిర్ణయించడం ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్​గా భావించారు. దీంట్లో భార్యభర్తలు, మైనర్ పిల్లలు ముగ్గురు ఉంటారు.
  •  ఐదుగురు మించిన కుటుంబానికి ఒక్కో సభ్యునికి 1/5 వంతు గరిష్ట పరిమితి పెంచవచ్చు. కాని అది ఎట్టి పరిస్థితుల్లో ప్రాథమిక గరిష్ట పరిమితికి రెండు రెట్లు మించరాదు. 
  •  ప్రామాణిక కమతం ఒక కుటుంబం లేదా యూనిట్​ ఉండాల్సిన చట్టబద్ధమైన భూమి
  •  భూమిని దాని తీరు, భూసారం, నీటిపారుదల, పంటల సంఖ్యను అనుసరించి నిర్ణయించారు.
  •  ఈ చట్టం ప్రకారం భూ గరిష్ట భూ పరిమితి వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

మాగాణి భూమి వర్గీకరణ: మాగాణి భూమిని ఎ, బి, సి, డి, ఈ, ఎఫ్​ అనే ఆరు రకాలుగా వర్గీకరించారు. రెండు పంటలు పండే భూమి గరిష్ట పరిమితి 10 ఎకరాల నుంచి 18 ఎకరాలుగా నిర్ణయించారు. ఒక పంట అయితే 15 నుంచి 27 ఎకరాలు గరిష్ట పరిమితి నిర్ణయించారు. 

మెట్టభూమి వర్గీకరణ: మెట్ట భూమిని జీ,హెచ్​, ఐ,జే అనే ఐదు రకాలుగా వర్గీకరించి 35 నుంచి 54 ఎకరాలు గరిష్ట పరిమితి నిర్ణయించారు.