మళ్లీ పెరిగిన కౌలు రేట్లు.. నీటి వసతి ఉంటే రూ.18వేలు ముట్టజెప్పాల్సిందే

మళ్లీ పెరిగిన కౌలు రేట్లు.. నీటి వసతి ఉంటే రూ.18వేలు ముట్టజెప్పాల్సిందే
  • ఏటా పెరుగుతున్న రేట్లతో నష్టపోతున్న కౌలు రైతులు 
  •  ఉమ్మడి జిల్లాలో 2.35 లక్షల  మంది  కౌలు రైతులు
  •  సర్కార్​ నుంచి అందని బెనిఫిట్స్​
  •  అకాల వర్షాలు, తగ్గిన దిగుబడులతో డీలా పడుతున్నరు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కౌలు రైతులు కష్టాల సుడిలో కూరుకుపోతున్నారు. ఏటా కౌలు ధరలు పెరుగుతుండడంతో  బేజారవుతున్నారు. సర్కారు ఆదుకోకపోగా భూయజమానులు కూడా ఏటా కౌలు ధరలు పెంచుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంట నష్టాలు, దిగుబడుల తగ్గుదలతో కౌలు రైతులు కోలుకోవడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  యాసంగి కోతలు ముగియగానే కౌలు ఒప్పందాల హడావుడి మొదలైంది.  ఈక్రమంలో భూమిని నమ్ముకున్న కౌలురైతులు తప్పనిపరిస్థితుల్లో పట్టాదారులు చెప్పిన రేటుకే ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఐదేండ్లుగా ఏటా ఎకరానికి రూ.3వేల నుంచి రూ.4వేల వరకు కౌలు పెరుగుతుండడం కౌలు రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. 

ఏటా పెరుగుతున్న కౌలు ధరలు 

ఉమ్మడి జిల్లాలో సాగునీటి వసతి పెరగడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. వానాకాలం సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. రాజన్న జిల్లాలో  2.50 లక్షల ఎకరాలు, జగిత్యాల 4.34 లక్షలు, కరీంనగర్  2.60లక్షల ఎకరాల్లో  వివిధ  పంటలు సాగవుతున్నాయి. ఇందులో దాదాపు 40 నుంచి 50 శాతం కౌలు రైతులే సాగుచేస్తున్నారు. నీటి లభ్యత, భూసారం, సీజన్‌ను బట్టి కౌలు ధరలు మారుతున్నాయి. పత్తి ఏడాదికి ఒకే పంట కావడంతో ఒకటే కౌలు ధర ఉంటోంది. వరి, ఇతర పంటలు వానాకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా ఒప్పందాలు జరుగుతున్నాయి.

నీటి వసతి ఎక్కువగా ఉన్న భూములకు రూ.14వేల నుంచి రూ.18వేల వరకు, తక్కువగా ఉన్న ఏరియాల్లో రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు కౌలు ధరలు జిల్లాలో ఎకరంలోపు సాగుభూములున్నవారు దాదాపు  2లక్షల  మంది వరకు  ఉన్నారు. వీరే తోటి రైతుల వద్ద 2 నుంచి 5 ఎకరాలు వరకు కౌలు తీసుకుని  సాగు చేస్తున్నారు. 

సర్కార్​ బెనిఫిట్స్ అందట్లే..  

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2.35లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో  40వేల మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 65 వేల మంది, జగిత్యాలలో 70 వేల మంది, కరీంనగర్ 60 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులను సర్కార్​గుర్తించకపోవడంతో వారు ఏ బెనిఫిట్ ​పొందలేకపోతున్నారు. రైతుబంధు, రైతు బీమా వంటివన్నీ భూయజమానులకే దక్కుతున్నాయి. భూములు వీరి పేరు మీద ఉండకపోవడం, కౌలు ఒప్పందాలను సర్కార్ ​గుర్తించకపోవడంతో బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వడం లేదు.

దీంతో పెట్టుబడుల కోసం కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేట్‌గా అప్పులు తీసుకుంటుండడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈఏడాది అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు తీవ్రంగా దెబ్బతిని దిగుబడులు తగ్గిపోయాయి. ఇలాంటి సందర్భాల్లోనూ సర్కార్​ అందించనున్న పరిహారం కూడా పట్టాదారుల పేరు మీదే రానుండడంతో వాస్తవంగా నష్టపోయిన కౌలు రైతుకు ఏమీ దక్కడం లేదు. పెరిగిన సాగు ఖర్చులు కూడా కౌలు రైతులను నష్టాలపాలు చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ట్రాక్టర్​ కిరాయిలు, ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో పెట్టుబడి ఖర్చు కూడా పెరగడంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు.  

ఎకరానికి 15వేలు చెల్లిస్తున్నా..

నాలుగెకరాలు కౌలుకు తీసుకొని యాసంగిలో వరి వేసిన.. చేతికొచ్చే టైంకు అకాల వర్షాలతో పంటంతా రాలిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. మళ్లీ కౌలుకు పట్టుకోవాలంటే  ధైర్యమైతలేదు. వానాకాలం సీజన్ లో కౌలు ఎకరాకు రూ.18వేలు పలుకుతోంది. అంత చెల్లించి సాగు చేసిన ఏమీ లాభం వస్తలేదు. అకాల వర్షాలతో  పంట నష్టపోయిన కౌలు రైతులను సర్కార్​ ఆదుకోవాలి. బాలకిషన్, కౌలు రైతు, కోనరావుపేట