- వేదోక్తంగా నదీహారతి
భద్రాచలం, వెలుగు : సాయం సంధ్య వేళ...గోదావరి తీరాన కలెక్టర్ జితేశ్ వి పాటిల్ స్వప్నం ఏరు ఉత్సవం శనివారం సాయంత్రం హోరెత్తింది. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ నృత్యాలతో సందడి చేశారు. తమ నృత్యాభినయంతో మెప్పించారు. గోదావరి కరకట్ట కింద, స్నానఘట్టాలపై ఏరు ఫెస్టివల్ ప్లాస్మోబ్ ఫెర్ఫార్మెన్స్ ను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లోని కళల సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాకుండా, నదుల పట్ల అవగాహనను పెంపొందించడానికి ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం నదీహారతి కార్యక్రమం నదుల సంరక్షణ, ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కల్గించడం కోసం నిర్వహించామన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి పరచడానికి ఈనెల 22 నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించినట్లుతెలిపారు. విద్యార్థుల్లో దాగిన కళా నైపుణ్యాలను ఇటువంటి సందర్భాలలో ప్రదర్శించడం వలన వారి మేధాశక్తితో పాటు నైపుణ్యాలను 10 మందిలో ప్రదర్శించడానికి అవకాశం కుదురుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో తెప్పోత్సవం రోజున చక్కటి ప్రదర్శనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్‌రావు, తహసీల్దారు వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ దొర తదితరులు పాల్గొన్నారు.స్టెప్పులతో అదరగొట్టిన కలెక్టర్విద్యార్థులతో పాటు ఏరు ఉత్సవంలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ దొర తమ స్టెప్పులతో అదరగొట్టారు. భక్తులు, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు.
వేదమంత్రాలు, శంఖనాదం మధ్య నదీ హారతి
వేదమంత్రాలు, శంఖనాదం మధ్య గోదావరి నదీ హారతి ఘనంగా జరిగింది. గోదావరిలో నిత్యం కోటి తీర్థాలు ప్రవహిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయని కలెక్టర్ జితేశ్ తెలిపారు. వేదకాలం నుంచే గోదావరి నదిని తల్లిగా సమానంగా భావిస్తారన్నారు. ‘రామలక్ష్మణ జానకి జై.. బోలో హనుమాన్‌కీ జై’ అంటూ జయజయధ్వానాలతో గోదావరి తీరం మారుమ్రోగింది.
