
తెలంగాణ చీఫ్ బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. వరంగల్ కు చేరుకున్న అనంతరం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బట్టల బజార్ కు చేరుకున్న బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ కు స్వాగతం పలికేందుకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడనే ఉన్న వరంగల్ ఏసీపీ గిరికుమార్.. ప్రదీప్ రావును అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయన్ను తోసేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ నేతలకు స్వాగతం పలికేందుకు వస్తే.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రదీప్ రావు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న బండి సంజయ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కు చేరుకున్న పాదయాత్రలో శుక్రవారం రాత్రి నుంచే ఉద్రిక్తత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నిర్వహించిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.
పాదయాత్రలో సంజయ్ ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ కలిసి సంఘీభావం తెలిపారు. 30మంది NRI గ్రాడ్యుయేట్ విద్యార్థులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఉదయం మామునూరు నుంచి మొదలైన పాదయాత్ర తిమ్మాపూర్ క్రాస్ రోడ్, నాయుడు పంప్ చౌరస్తా, రంగశాయిపేట, గవిచర్ల క్రాస్ రోడ్, శంభునిపేట, మిల్స్ బజార్ మీదుగా ఎంజీఎం జంక్షన్ చేరుకుంది. మధ్యాహ్నం భద్రకాళి ఆలయంలో పూజల తర్వాత పాదయాత్ర ముగింపు సభలో సంజయ్ పాల్గొంటారు. మరోవైపు.. హన్మకొండ బహిరంగ సభలో పాల్గొనేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా చేరుకున్నారు. నోవాటెల్ హోటల్ లో భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్.. నడ్డాను కలిశారు. సాయంత్రం హీరో నితిన్ కూడా భేటీ కానున్నారు.