హనుమకొండ బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

హనుమకొండ బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

హనుమకొండ బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసమయ్యాయి. కొన్ని గంటల పాటు ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. దాడి చేస్తారని ముందే సమాచారం ఉన్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

అసలేం జరిగింది ? 
హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయనే సంగతి తెలిసిందే. 347 మంది జాతీయ నేతలు హైదరాబాద్ కు క్యూ కట్టారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేశారు. ఈ క్రమంలో.. హనుమకొండలోని బీజేపీ కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జాతీయ నేతతో పాటు లోకల్ లీడర్లు పాల్గొన్నారు. ఈ సమయంలో.. అగ్నిపథ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం కలకలం రేపింది. కార్యాలయంపై దాడి చేస్తారనే సమాచారంతో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. నేతల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

సుబేదారి సీఐ గన్ మన్ కు గాయాలు :-
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాడుల్లో సుబేధారి సీఐ గన్ మన్ కు గాయాలయ్యాయి. సమావేశం డిస్ట్రబ్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని బీజేపీ నేతలు దుయ్యబట్టారు. బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా చేస్తదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా పోలీసులు ఎందుకు రెస్పాండ్ కాలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.