పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత


మునగాల/కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో గురువారం నిర్వహించ తలపెట్టిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కొంతకాలంగా గ్రామంలోని ఎమ్మెల్యే వర్గానికి, సర్పంచ్ వర్గానికి మధ్య పోరు నడుస్తోంది. గ్రామానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి గురువారం ఉదయం ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ ఆఫీసులో నిర్వహించాలని సర్పంచ్ ఒట్టికూటి చంద్రకళ నాగయ్య,   స్థానిక ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, ఎంపీటీసీ మెంబర్లు వట్టికూటి ధనమూర్తి, నెమ్మాది నాగలక్ష్మి సైదా బాబు, ఇతర ప్రజాప్రతినిధులు నిర్ణయించారు.

అందుకు తగిన ఏర్పాట్లు గ్రామపంచాయతీ వద్ద చేశారు. ఇదే కార్యక్రమాన్ని స్థానిక ఫంక్షన్ హాల్ లో నిర్వహించాలని ఎమ్మెల్యే వర్గంవారు పోటాపోటీగా వేదిక ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సభ ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సర్పంచి వర్గం కార్డులను పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శి సురేశ్​ను కోరగా ఆయన స్పందించలేదు. కొద్దిసేపటి తర్వాత ఆయన ఫంక్షన్ హాల్ లో పంపిణీ చేసేందుకు ఆఫీస్ వెనక గోడ దూకి కార్డులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా లబ్ధిదారులు, సర్పంచ్ వర్గంవారు అడ్డుకున్నారు.

పోలీసులు అక్కడికి చేరుకొని సర్పంచ్ వర్గాన్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా ఇక్కడే పంపిణీ చేయాలని పట్టుబట్టారు. ఆఫీసు బీరువాలో ఉన్న పింఛన్ కార్డులను పోలీసులు బలవంతంగా తీసుకుపోయేందుకు ప్రయత్నించగా ఆ గదిలోనే బైఠాయించిన సర్పంచ్, వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అక్కడకు చేరుకొని సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులను ఆఫీసులోకి పిలిపించుకొని చర్చించారు.

చర్చల అనంతరం కొద్దిసేపటి తర్వాత పోలీసుల సహకారంతో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ఫంక్షన్ హాల్ కు కార్డులను తీసుకొని వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గ్రామానికి చేరుకోగా అనుచరులు ర్యాలీగా ఫంక్షన్ హాల్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పోలీసుల వైఖరిని నిరసిస్తూ కొంతమంది లబ్ధిదారులు, సర్పంచ్ వర్గం పంచాయతీ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే  గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొందరు టమాటాలు విసిరేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే ఫంక్షన్ హాల్​కు చేరుకొని కార్యక్రమం నిర్వహించారు.