రైస్ ​మిల్లర్ల టెన్షన్​..స్టాక్​ ఎలా అడ్జస్ట్ ​చేయాలో తెలియక సతమతం

రైస్ ​మిల్లర్ల టెన్షన్​..స్టాక్​ ఎలా అడ్జస్ట్ ​చేయాలో తెలియక సతమతం
  •     సీఎంఆర్​ మిల్లుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీలు 
  •     10 శాతం కంటే వడ్లు తగ్గితే చర్యలు తీస్కుంటున్న అధికారులు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాలోని రైస్​మిల్లర్లలో సీఎంఆర్ టెన్షన్ మొదలైంది. దారి మళ్లించిన సీఎంఆర్ ను ఎలా అడ్జస్ట్​ చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చీరాగానే స్టాక్​తనిఖీ ప్రారంభించడంతో మిల్లర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మార్కెట్ల నుంచి తెద్దామంటే ఇప్పటికే అన్నిచోట్ల వడ్లన్నీ అయిపోయాయి. కొందామంటే ఎక్కడా గింజ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన వడ్లలో10 శాతానికి మించి తగ్గుదల ఉంటే సివిల్​సప్లయ్​అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఐదు మిల్లులు సీజ్

సీఎం రేవంత్​రెడ్డి సీఎంఆర్​పై ప్రత్యేక ఫోకస్​పెట్టారు. అధికారంలోకి రాగానే సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​ను రంగంలోకి దింపారు. ఇప్పటికే చాలాచోట్ల తనిఖీలు జరిపారు. రెండు వారాల కింద నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సంబంధించిన మిల్లుల్లో సీఎంఆర్ దారి మళ్లిందని ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు తనిఖీ చేశారు. తాజాగా వనపర్తి జిల్లాలోని మిల్లులో బియ్యం మాయమైందని తేలడంతో ఐదు మిల్లులను సీజ్​చేశారు. 2022 వానాకాలం, 2022–-23 యాసంగి, 2023 వానాకాలం సీజన్.. ఇలా మూడు విడతల వడ్లు రైస్ మిల్లుల్లోనే ఉన్నాయి. కొందరు మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సీఎంఆర్​వివరాలను ప్రభుత్వానికి అందించలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుంది. డిసెంబర్​31లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమానాలు, ఫిర్యాదులు ఉన్న మిల్లుల్లో పూర్తిస్థాయి తనిఖీలకు సివిల్ సప్లయ్​డిపార్ట్​మెంట్​రెడీ అవుతోంది.

10 శాతం కంటే తగ్గితే..

రైస్​మిల్లర్లతో సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​అధికారులు ఇటీవల హైదరాబాద్​లో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. సీఎంఆర్​పై సీరియస్​గా చర్చ  నడిచింది. తమకు మరికొంత సమయం కావాలని కొందరు మిల్లర్లు కోరినట్టు సమాచారం. దీంతో వడ్ల స్టాక్​ఉందో లేదో తెలుసుకోవడానికి త్వరలోనే తనిఖీలు చేస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇచ్చిన వడ్లల్లో 10 శాతం కంటే ఎక్కువ తేడా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. ముందుగా అనుమానం ఉన్న మిల్లుల్లో తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

యాదాద్రి మిల్లుల్లో రూ.వెయ్యి కోట్ల వడ్లు

యాదాద్రి జిల్లాలోని మిల్లర్ల వద్ద మూడు సీజన్లకు సంబంధించి ఐదు లక్షల టన్నుల వడ్లు స్టాక్​ఉంది. వీటి విలువ రూ.వెయ్యి కోట్లు ఉంటుంది. ఒక్క మిల్లులో దాదాపు రూ.80 కోట్ల వడ్లు స్టాక్ ఉన్నట్టు తెలుస్తోంది. 2022 వానాకాలం సీజన్​కు సంబంధించి 2,85,216 టన్నుల వడ్లను సివిల్​ సప్లయ్​ కొనుగోలు చేసి, 44 మిల్లులకు అప్పగించింది. ఈ వడ్లకు సంబంధించి 1,91,095 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అందించాల్సి ఉంది. 

అయితే మూడో సీజన్​వడ్ల కొనుగోలు ముగిసినా ఇప్పటి వరకూ 1.70 లక్షల టన్నులను మాత్రమే మిల్లర్లు అప్పగించారు. ఇంకా 20 వేల టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. 2022–-23 యాసంగి సీజన్​కు సంబంధించి సివిల్​సప్లయ్​4,11,181 టన్నుల వడ్లను సేకరించి 47 మిల్లులకు అప్పగించింది. ఈ వడ్లను మరాడించి 2,79,603 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అందించాల్సి ఉంది. ఇప్పటివరకూ కేవలం 26 శాతం (80 వేల టన్నులు) బియ్యాన్ని మాత్రమే అప్పగించారు. 

ఇంకా 2 లక్షల టన్నుల బియ్యాన్ని అందించాల్సి ఉందని లెక్కుల చెబుతున్నాయి. 2023 వానాకాలం సీజన్​ముగియడంతో 51 మిల్లులకు దాదాపు 3 లక్షల టన్నుల వడ్లను సివిల్​సప్లయ్​ డిపార్ట్​మెంట్​ అందించింది. జిల్లాలోని 51 రైస్​ మిల్లుల్లో కలిపి 5 లక్షల టన్నులకు పైగా వడ్లు స్టాక్ ఉన్నాయి. అయితే అన్నిచోట్ల లెక్క ప్రకారం వడ్లు ఉన్నాయా? లేవా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ. 80 కోట్ల విలువైన వడ్లను రైస్​మిల్లర్స్​అసోసియేషన్​స్టేట్​ ప్రెసిడెంట్​ గంపా నాగేందర్​కు చెందిన కాదంబరి మిల్లుకు అందించారని తెలుస్తోంది. యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోని ఒక మిల్లులో రూ.3 కోట్లకు పైగా విలువైన సీఎంఆర్​ బియ్యం పెండింగ్​లో ఉంది. ఇటీవల ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. జిల్లాలోని మరో మిల్లర్ తన మిల్లును అమ్మకానికి పెట్టినట్టుగా సమాచారం. 

అడ్జస్ట్​మెంట్ ఎలా?

2023 వానాకాలం వడ్ల కొనుగోళ్లు ఇప్పటికే ముగిశాయి. మార్కెట్లో గింజ వడ్లు లేవు. ఈ సమయంలో తనిఖీలు చేస్తే స్టాక్​ ఎలా చూపించాలని మిల్లర్లు మదనపడుతున్నారు. జిల్లాలోని కొందరు మిల్లర్లు సీఎంఆర్​వడ్లను అమ్మగా వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెట్టారు. ఆలేరు నియోజకవర్గంలోని ఇద్దరు, ఇతర ప్రాంతాల్లోని మరికొందరు వడ్లను మరాడించి, బియ్యాన్ని అమ్ముకున్నారు. ఆ పైసలను రియల్​ఎస్టేట్ బిజినెస్​లో పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. తగ్గిన స్టాక్​ను భర్తీ చేయడం కోసం క్వింటాల్ వడ్లను రూ.1,900 లెక్కన కొన్నారు. ఇలా ఈ సీజన్​లో రెండు లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయినా కొందరు స్టాక్​ను భర్తీ చేయలేక పోయారని సమాచారం.