ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. జూన్ 7 నుంచి పరీక్షలు జరపున్నట్లు ఇది వరకు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మేలో కరోనా ఉధృతి తగ్గాక... జూన్ లో పాఠశాలలు ప్రారంభించక ముందే జూన్ 7 నుంచి పరీక్షలు జరపాలని ఆలోచించారు. అయితే మేలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండడం.. చాలా చోట్ల స్కూళ్లను క్వారెంటైన్ సెంటర్లుగా.. వ్యాక్సినేషన్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నందున పరీక్షల నిర్వహణకు ఆటంకం కలగనుంది. అంతేకాదు స్కూల్ టీచర్లు కూడా భారీ సంఖ్యలో కరోనాతో మృత్యువాత పడడంతో ఇప్పుడే పరీక్షలు జరపొద్దంటూ ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్న విషయం తెలిసిందే.
అలాగే తల్లిదండ్రులు కూడా ఇప్పట్లో పరీక్షలు వద్దని కోరుతున్నందున జూన్ 7 నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. జూన్ లో పరిస్థితులు అనుకూలించాక.. పరిస్థితిని బట్టి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలపై కూడా అన్నివర్గాల అభిప్రాయల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కాస్త ఆలస్యమైనా సరే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేస్తోందని, జేఈఈ, నీట్‌ వంటి ఎంట్రెన్స్‌ టెస్టులకు మార్కులు అవసరం’ అని ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 
హైకోర్టులో విచారణ
పదో తరగతి పరీక్షల నిర్వహణపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరగా టెన్త్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కరోనా కేసుల ఉధృతి తగ్గనందున ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం కూడా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీచర్లను  ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించడంలేదంటూ దాఖలైన అఫిడవిట్‌పై విచారణ ముగించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే పరీక్షల వాయిదా, స్కూళ్లు తెవబోమని అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు కేసు తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.