తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ రద్దు?

తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ రద్దు?
  •     ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా..
  •     సెకండియర్ ఎగ్జామ్స్ కొన్ని రోజులు వాయిదా!
  •     ఇయ్యాల విద్యాశాఖ ఆఫీసర్ల సమీక్ష
  •     రివ్యూ రిపోర్టును సర్కారుకు పంపనున్న అధికారులు
  •     త్వరలో సీఎం కేసీఆర్​ నిర్ణయం

సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. టెన్త్​బోర్డు ఎగ్జామ్స్​తో పాటు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని యోచిస్తోంది. సెకండియర్ ఎగ్జామ్స్ మాత్రం మరి కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తోంది. గురువారం విద్యా శాఖ అధికారులు ఎగ్జామ్స్​పై నిర్వహించే సమీక్ష కీలకంగా మారింది.

అంతా అయోమయం

రాష్ట్రంలో టెన్త్ స్టూడెంట్లు 5.2 లక్షల మంది, ఫస్టియర్ స్టూడెంట్లు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు. ఇంటర్ స్టూడెంట్లకు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో, పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. దీంతోనే మార్చి 24 నుంచి విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది. ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల1న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఈనెల 3న జరగాల్సిన ఎన్విరాన్​మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఇంటి నుంచి రాసి పంపించే అవకాశమిచ్చింది. ఈనెల 7 నుంచి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ప్రకటించింది. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయా లేదా అనే దానిపై స్టూడెంట్లు, పేరెంట్స్​లో ఆందోళన మొదలైంది.

సీబీఎస్ఈ బాటలో..

కరోనా కేసులు పెరుగుతుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని సీబీఎస్ఈ బుధవారం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపైనా నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. దీనివల్ల పిల్లల్లో టెన్షన్ తగ్గుతుందని యోచిస్తోంది. గురువారం ఇంటర్ బోర్డు అధికారులతో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రా రాంచంద్రన్​సమావేశమవుతున్నారు. తర్వాత ఎస్ఎస్​సీ బోర్డు అధికారులతో సమీక్షించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే సెకండియర్  ​మార్కులతో పలు నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్​కు లింక్ ఉండటంతో, కాస్త లేటైనా వారికి పరీక్షలు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సెకండియర్​ ఎగ్జామ్స్​ను తాత్కాలికంగా వాయిదా వేయాలని యోచిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. గురువారం సమీక్ష రిపోర్టును సర్కారుకు పంపిస్తే.. సీఎం కేసీఆర్​నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు.

ఎగ్జామ్స్​పెట్టినా యూజ్ లేదనే

అకడమిక్ ఇయర్ జూన్ లో ప్రారంభం కావాల్సి ఉన్నా, కరోనా ఎఫెక్ట్​తో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆన్​లైన్, డిజిటల్ పాఠాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేసి, మళ్లీ మార్చి 24న బంద్ చేశారు. టెన్త్, ఇంటర్​లో సిలబస్​ పూర్తి కాలేదు. ఆన్​లైన్ పాఠాలు పిల్లలకు అర్థం కాలేదు. ఈ క్రమంలో పిల్లలకు పరీక్షలు పెట్టినా పెద్దగా ఉపయోగం లేదని సర్కారు యోచిస్తున్నట్టు తెలిసింది. మరోపక్క ఎగ్జామ్స్ పెట్టాలంటే తప్పకుండా హాస్టల్స్​రీఓపెన్ చేయాల్సి ఉంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ సాహసం చేసేందుకు సర్కారు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. దీంతోనే టెన్త్, ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రద్దుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.