గుండెపోటుతో టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి.. ఆడుకుంటూ సడెన్గా పడిపోయిన 15 ఏండ్ల బాలుడు

గుండెపోటుతో  టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి.. ఆడుకుంటూ సడెన్గా పడిపోయిన 15 ఏండ్ల బాలుడు
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి
  • హనుమకొండలోని ఓ ప్రైవేటు స్కూల్ లో ఘటన
  • కలవరపెడుతున్న చిన్నారుల్లో గుండెపోట్లు

హనుమకొండ, వెలుగు: గుండెపోటుతో టెన్త్ క్లాస్ స్టూడెంట్ మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండలోని నయీంనగర్ తేజస్వీ స్కూల్ మెయిన్ బ్రాంచ్ లో గురువారం (సెప్టెంబర్ 11) జరిగింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటకు చెందిన పోలపెల్లి రవి, -రజిత దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీశాంత్ వర్ధన్ బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న కొడుకు జయంత్ వర్ధన్(15) తేజస్వీ స్కూల్ లో పదో తరగతి చదువుతున్నాడు. 

జయంత్ వర్ధన్ ఎప్పటిలాగే గురువారం ఉదయం స్కూల్ కు వెళ్లాడు. ఉదయం11 గంటలకు గేమ్స్ పీరియడ్ లో తోటి విద్యార్థులతో కలిసి ఆటలు ఆడుతుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్కూల్ సిబ్బంది.. వెంటనే జయంత్ ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పల్స్​పడిపోయిందని అక్కడి డాక్టర్లు చెప్పడంతో  హనుమకొండలోని ఏకశిలా హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. కానీ, అప్పటికే జయంత్​చనిపోయాడు. జయంత్ డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. 

కార్డియాక్ అరెస్ట్ వల్లే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే, జయంత్ మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. అకస్మాత్తుగా ముక్కు, చెవి నుంచి రక్తం రావడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ  స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు స్టూడెంట్ లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్కూల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్ట్రెస్ వల్ల పిల్లల గుండెకు ముప్పు

చిన్నపిల్లల్లో గుండె సమస్యలకు స్ట్రెస్ కార్డియోమయోపతి కారణం కావచ్చు. ఎక్కువగా స్ట్రెస్ కు లోనైతే గుండె కండరాలు విపరీతంగా కొట్టుకోవడం, హార్ట్ కు రక్తం సరఫరా నిలిచిపోవడం లాంటివి జరుగుతాయి. అంతేగాకుండా.. వాల్యులర్ హార్ట్ డిసీజెస్, కార్డియోమయోపతి, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, అరిథమోజెనిక్ రైట్ వర్టిక్యులర్ డిస్ ప్లేసియా.. లాంటి జబ్బులు బయటకు కనిపించకుండా సడెన్ గా చనిపోవడానికి కారణం అవుతాయి. 

చిన్నవయసులో హార్ట్ ఎటాక్ వచ్చే వారికి ఇందులో ఒక జబ్బు ఉందని అనుమానించవచ్చు. జిమ్ లో జాయిన్ అయ్యేవారు కూడా ముందుగా కార్డియోలజిస్ట్ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేదంటే గుండెపోటు బారిన పడాల్సి వస్తుంది.  - డాక్టర్ ​షఫీ, కార్డియోలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్