అరే మార్చి నెల అయిపోయింది హైక్ గురించి కంపెనీ మర్చిపోయిందా ఏంటి కనీసం మాట కూడా మాట్లాడటం లేదు అని చాలా మంది ఉద్యోగులు ఫీలవుతుంటారు. అసలే పెరుగుతున్న ఖర్చులను భరించాలంటే కనీసం కొంతైనా శాలరీ హైక్ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక టెక్ కంపెనీ సీఈఓ ఉద్యోగులకు ఒక్క మాటతో షాక్ ఇచ్చాడు. హైక్ కావాలనుకున్నోళ్లు వెళ్లిపోవచ్చంటూ పెద్ద క్లాస్ పీకటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఏఐ టెక్నాలజీని అందుకోవడానికి కంపెనీలు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఏఐ రేసులో నిలబడటానికి అయ్యే భారీ ఖర్చును తట్టుకోలేక, సంస్థలు తమ సొంత ఉద్యోగుల జీతాల బడ్జెట్‌కు కోత పెడుతుండటం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా గ్లోబల్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టెరాడేటా తీసుకున్న సంచలన నిర్ణయం మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది.
టెరాడేటా కంపెనీ తన 5వేల 100 మంది ఉద్యోగులకు ఈ ఏడాది శాలరీ హైక్స్ ఉండబోదని తేల్చి చెప్పింది. ఆ బడ్జెట్ మొత్తాన్ని ఏఐ ప్రాజెక్టులు, ఏఐ నిపుణులను కంపెనీలోకి తీసుకొచ్చేందుకు డైవర్ట్ చేస్తున్నట్లు సంస్థ సీఈఓ స్టీవ్ మెక్‌మిలన్ ఉద్యోగులకు స్పష్టంగా చెప్పారు. సాధారణంగా ఏటా 2 నుండి 4 శాతం వచ్చే జీతాల పెంపు కూడా ఈసారి ఆగిపోవడంతో.. దశాబ్ద కాలంగా సంస్థ నమ్ముకున్న సీనియర్ ఉద్యోగులు సైతం షాక్‌కు గురవుతున్నారు. కేవలం బోనస్‌లు, ఈక్విటీ షేర్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కంపెనీలు ఏఐ వైపు మళ్లుతున్న వేళ.. చిన్నపాటి ఏఐ ప్రాజెక్ట్‌కే వేల డాలర్లు, పెద్ద ఎత్తున అమలు చేయాలంటే మిలియన్ల డాలర్ల నిధులు అవసరమవుతున్నాయి. ఈ ఖర్చులను తట్టుకోవడానికి కంపెనీలు ఉద్యోగాల కోత, కొత్త నియామకాల నిలిపివేత, శాలరీ హైక్స్ ఫ్రీజ్ వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మెటా, స్నాప్, సిస్కో వంటి కంపెనీలు ఏఐ కోసమే లేఆఫ్స్ ప్రకటించగా.. గూగుల్ సైతం ఏఐ పెట్టుబడుల కోసం 80 బిలియన్ డాలర్ల స్టాక్ విక్రయానికి సిద్ధమైంది.
రాబోయే రోజుల్లో ఏఐ బడ్జెట్ బిల్లు ఏకంగా జపాన్, భారత్ దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉండబోతోందన్న అంచనాలు వర్క్‌ఫోర్స్‌లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఏఐ యుగంలో పోటీని తట్టుకునేందుకు కంపెనీలు చేస్తున్న ఈ ట్రేడ్-ఆఫ్స్ ఉద్యోగులను ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఒకపక్క ఉద్యోగాలు పోతుంటే మరోపక్క ఉన్న ఉద్యోగంలో ఎదుగూబొదుగూ లేకుండా కెరీర్ అస్థవ్యస్థంగా మారిందని లక్షల మంది టెక్కీలు ఏఐ వేవ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా.
