మదర్​ డెయిరీ పాలకవర్గం రద్దు.. హైకోర్టు ఉత్తర్వులు జారీ

మదర్​ డెయిరీ పాలకవర్గం రద్దు.. హైకోర్టు ఉత్తర్వులు జారీ
  • త్వరలో త్రిమెన్ కమిటీ ఏర్పాటుకు అధికారుల కసరత్తు
  •   నెల రోజులో మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు

నల్గొండ, వెలుగు: నల్గొండ-–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం(మదర్​డెయిరీ)​​ పాలకవర్గాన్ని హైకోర్టు రద్దు చేసింది. గతంలో విధించిన స్టేను బుధవారం రద్దు చేసింది. గత సెప్టెంబర్​లో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు పెట్టకుండా మ్యాక్స్ చట్టాన్ని ఉల్లంఘించిన పాలకవర్గాన్ని రద్దు చేయాలని పలు సొసైటీల అధ్యక్షులు అప్పటి రంగారెడ్డి జిల్లా డీసీవో, జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ఒత్తిడి వల్ల అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వివిధ సొసైటీల అధ్యక్షులు మరోసారి డీసీవో, కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లా డీసీవో ధాత్రి విచారించి మ్యాక్స్ చట్టాన్ని ఉల్లంఘించారని తేల్చి పాలకవర్గాన్ని రద్దు చేశారు. డీసీవో ఆర్డర్స్​ను సవాల్ చేస్తూ డెయిరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. డీసీవో ఆదేశాలపై డిసెంబర్​లో హైకోర్టు స్టే విధించింది. బుధవారం చివరి వాదనల తర్వాత పాలకవర్గాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.