
- ఔత్సాహికులకు ప్రతి నెలా శిక్షణ కార్యక్రమాలు
- రూఫ్ గార్డెన్‌ల ఏర్పాటుకూ హార్టికల్చర్ శాఖ సబ్సిడీలు
హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్ జంగిల్‌గా మారిన పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల టెర్రస్‌లు ఇప్పుడు కూరగాయలు, పూల మొక్కలు, ఔషధ మొక్కలతో పచ్చని ఉద్యానవనాలుగా మారుతున్నాయి. పట్టణ జీవనశైలిలో పర్యావరణ సమతుల్యతను పెంచేందుకు, ఒత్తిడిని తగ్గించే దిశగా టెర్రస్ గార్డెన్‌లు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ హరిత విప్లవానికి హార్టికల్చర్ శాఖ సైతం శిక్షణ కార్యక్రమాలు, సబ్సిడీలతో ఊతమిస్తోంది. టెర్రస్ గార్డెనింగ్ ఇప్పుడు కేవలం అభిరుచిగానే కాకుండా, అర్బన్ లైఫ్ లో ఒక జీవనశైలిగా, ఇండ్ల పైకప్పులపై ఒక హరిత విప్లవంగా మారింది. పర్యావరణ సమతుల్యత, ఆరోగ్యకరమైన జీవనం నేపథ్యంలో టెర్రస్ గార్డెనింగ్ అనేది పట్టణవాసుల జీవనంలో కొత్త స్ఫూర్తిని నింపుతోంది.
పట్టణ జీవనంలో కొత్త ఊపిరి
పట్టణవాసుల్లో ప్రకృతితో మమేకం కావాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ‘‘మా టెర్రస్ గార్డెన్ నా ఒత్తిడిని తగ్గించడమే కాక, టమాటాలు, వంకాయలు, కొత్తిమీర, పుదీనా వంటి తాజా కూరగాయలను అందిస్తోంది’’ అని హైదరాబాద్ బంజారాహిల్స్ వాసి శిల్పారెడ్డి తెలిపారు. ఇలాంటి గార్డెన్‌లు కేవలం అభిరుచి కోసమే కాక, ఆరోగ్యకరమైన ఆహారం, తాజా ఉత్పత్తులకు పరిష్కారంగా మారుతున్నాయి. టెర్రస్ గార్డెన్‌లు పట్టణ ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాక, ఇవి ఇంటి ఉష్ణోగ్రతలను తగ్గించి విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే గ్రీన్ బ్యాగ్‌లు, ప్లాస్టిక్ డ్రమ్ములు, టబ్‌లు, మట్టి తొట్లలో గ్రీన్ షేడ్లు వేసి మొక్కలు పెంచుతున్నారు. తద్వారా వర్షపు నీటి సేకరణ, రీసైక్లింగ్ విధానాల ద్వారా నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా ఈ గార్డెన్‌ల ప్రత్యేకతగా నిలుస్తోంది.
గార్డెనింగ్‌లో ఆధునిక పద్ధతులు
స్థల పరిమితి ఉన్న పట్టణ ప్రాంతాల్లో వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ వంటి ఆధునిక పద్ధతులు టెర్రస్ గార్డెనింగ్‌ను మరింత సులభతరం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు ఈ ధోరణిని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి ఉషారాణి మాట్లాడుతూ.. ‘‘సామాజిక మాధ్యమాల ద్వారా నేను కొత్త టెక్నిక్‌లు, మొక్కల సంరక్షణ గురించి నేర్చుకున్నా” అని తెలిపారు.
హ్యాష్‌ట్యాగ్‌లతో వేలాది మంది తమ గార్డెన్‌ల ఫొటోలను, అనుభవాలను పంచుకుంటూ యువతను ఆకర్షిస్తున్నారు. టెర్రస్ గార్డెన్‌లు ఆర్థికంగానూ లాభదాయకంగా మారుతున్నాయి. ‘‘నెలకు దాదాపు రూ.2 వేల వరకు కూరగాయల ఖర్చు ఆదా చేస్తున్నా’’ అని వరంగల్ కాజీపేటకు చెందిన గృహిణి గూడూరు వరలక్ష్మీ తెలిపారు.
టెర్రస్ గార్డెన్లపై ప్రతి నెలా శిక్షణ
పట్టణ ప్రాంతంలో గ్రీనరీని ప్రోత్సహించేందుకు తెలంగాణ హార్టికల్చర్ శాఖ చర్యలు చేపడుతోంది. సర్కారు సంస్థగా హరిత విప్లవంలో భాగస్వాములం అవుతున్నాం. ప్రతి నెలా రెండో శనివారం ఉచిత శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక సలహాలు అందిస్తున్నాం. ఔత్సాహికులకు సబ్సిడీలతో ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాం. - యాస్మిన్ బాషా, కమిషనర్, హార్టికల్చర్ శాఖ