పాక్​లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి

పాక్​లో ఆత్మాహుతి దాడులు.. 58 మంది మృతి
  •     మిలాద్–ఉన్–నబీ వేడుకలు లక్ష్యంగా టెర్రరిస్టుల అటాక్స్
  •     రెండు మసీదుల వద్ద  సూసైడ్ బ్లాస్టులు 

ఆత్మాహుతి దాడులతో పాకిస్తాన్ దద్దరిల్లింది. శుక్రవారం మిలాద్​- ఉన్​- నబీ వేడుకలు జరుపుకుంటున్న టైమ్​లో టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. రెండు మసీదుల వద్ద సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చుకున్నారు. ఈ ఘటనల్లో 58 మంది చనిపోగా మరో 112 మందికి పైగా గాయపడ్డారు.

కరాచీ/పెషావర్ : వరుస ఆత్మాహుతి దాడులతో పాకిస్తాన్ దద్దరిల్లింది. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జనం శుక్రవారం మిలాద్–ఉన్–నబీ వేడుకలు జరుపుకుంటున్న టైమ్ లో టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. గంటల వ్యవధిలో రెండు మసీదుల వద్ద సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చుకున్నారు. ఈ ఘటనల్లో 58 మందికి పైగా చనిపోగా, మరో 112 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మొదట బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని మస్తుంగ్ జిల్లాలో ఆత్మాహుతి దాడి జరగ్గా, ఆ తర్వాత కొన్ని గంటలకు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని హంగు జిల్లాలో జరిగింది. కాగా, ఈ దాడులపై ఏ టెర్రరిస్టు సంస్థ స్పందించలేదు. 

డీఎస్పీ కారు పక్కనే పేల్చుకున్న సూసైడ్ బాంబర్.. 

బలూచిస్తాన్ ప్రావిన్స్ మస్తుంగ్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మిలాద్–ఉన్–నబీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ నవాజ్ గష్కోరీ బందోబస్తును పర్యవేక్షించారు. అయితే ర్యాలీ మదీనా మసీదు వద్దకు చేరుకోగానే ఆత్మాహుతి దాడి జరిగింది. డీఎస్పీ కారు పక్కనే సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో 54 మంది చనిపోగా, మరో 100 మంది గాయపడ్డారు. డ్యూటీలో ఉన్న డీఎస్పీ నవాజ్ గష్కోరీ కూడా ప్రాణాలు కోల్పోయారు.

గాయపడినోళ్లను ఆస్పత్రులకు తరలించామని సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ జావెద్ లెహ్రీ తెలిపారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, మస్తుంగ్ జిల్లాలో కీలకమైన ఐఎస్ కమాండర్ ను పోలీసులు చంపేసిన తెల్లారే దాడి జరిగింది. గత కొన్నేండ్లుగా మస్తుంగ్ జిల్లా లక్ష్యంగా టెర్రర్ దాడులు జరుగుతున్నాయి. ఈ నెల మొదట్లో జరిగిన బ్లాస్ట్ లో 11 మంది చనిపోయారు.  

దోషులను విడిచిపెట్టం : సీఎం 

ఆత్మాహుతి దాడిని బలూచిస్తాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్ డోమ్కీ తీవ్రంగా ఖండించారు. ‘‘ర్యాలీని టార్గెట్ చేసుకుని దాడి చేశారు. విధ్వంసకారులను విడిచిపెట్టం” అని హెచ్చరించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జనమంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ‘‘ఇస్లాం మతం శాంతికి ప్రతిరూపం. ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవాళ్లను ముస్లింలు అనలేం” అని అన్నారు.

ప్రావిన్స్ వ్యాప్తంగా మూడ్రోజులు సంతాప దినాలు ప్రకటించారు. బలూచిస్తాన్ లో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు శత్రువులు  ప్రయత్నిస్తున్నారని మంత్రి జాన్ అచక్ జాయ్ అన్నారు. కాగా, ఆత్మాహుతి దాడిని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు ఖండించారు.

స్టేషన్​లోకి చొరబడి.. 

బలూచిస్తాన్ లో దాడి జరిగిన కొన్ని గంటలకు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో సూసైడ్ బ్లాస్ట్ జరిగింది. హంగు జిల్లా దౌబా సిటీలోని మసీదులో శుక్రవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే ఆ టైమ్ లో మసీదు పక్కనే ఉన్న దౌబా పోలీస్ స్టేషన్ లోకి ఐదుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు.

ఈ టైమ్ లో మరో టెర్రరిస్టు మసీదు దగ్గర తనను తాను పేల్చుకున్నాడు. బాంబు పేలుడు ధాటికి మసీదు పైకప్పు కుప్పకూలింది. దీంతో మసీదు లోపల ప్రార్థనలు చేస్తున్న నలుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. బ్లాస్ట్ జరిగిన టైమ్ లో మసీదులో 30 నుంచి 40 మంది ఉన్నారని, మిగతా వారిని రక్షించామని పోలీసులు తెలిపారు. ముగ్గురు టెర్రరిస్టులు పారిపోయారని చెప్పారు.