పాక్ ఆర్మీ పోస్టుపై ఆత్మాహుతి దాడి .. 23 మంది సైనికులు మృతి 

పాక్ ఆర్మీ పోస్టుపై ఆత్మాహుతి దాడి .. 23 మంది సైనికులు మృతి 
  • మరికొందరి పరిస్థితి విషమం
  • తామే దాడి చేశామన్న టీజేపీ మిలిటెంట్ సంస్థ

పెషావర్: పాకిస్తాన్ లో ఆర్మీ పోస్టుపై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 23 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్ డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా దారాబన్ ఏరియాలోని ఆర్మీ పోస్టుపై మంగళవారం తెల్లవారుజామున టెర్రరిస్టులు దాడి చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే టెర్రరిస్టులను సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

దీంతో టెర్రరిస్టులు పేలుడు పదార్థాలున్న వెహికల్ తో లోపలికి దూసుకెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా పేలుళ్లు జరిగి బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. ఈ దాడిలో 23 మంది సైనికులు చనిపోయారని పాక్ ఆర్మీ  తెలిపింది. మరికొంత మంది గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ఆరుగురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టిందని పేర్కొంది. భద్రతా బలగాలు స్పాట్​కు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని వివరించింది. కాగా, దాడి కారణంగా జిల్లా ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ చేశారు. 

టీటీపీ అనుబంధ సంస్థ టీజేపీ.. 

ఆర్మీ పోస్టుపై ఆత్మాహుతి దాడి తామే చేశామని తెహ్రీక్–ఇ–జిహాద్ పాకిస్తాన్ (టీజేపీ) ప్రకటించింది. ఇదొక సూసైడ్ మిషన్ అని టీజేపీ అధికార ప్రతినిధి ముల్లా ఖాసీం తెలిపారు. టీజేపీ కొత్తగా ఏర్పాటైన మిలిటెంట్ సంస్థ. ఇది తెహ్రీక్–ఐ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు అనుబంధ సంస్థ. పాక్ లో జరిగిన మేజర్ అటాక్స్ వెనుక టీజేపీ హస్తం ఉంది. నవంబర్ 3న మూడుచోట్ల జరిగిన టెర్రర్ దాడుల్లో 17 మంది సైనికులు చనిపోయారు. ఆ తర్వాతి రోజు పాక్ ట్రైనింగ్ ఎయిర్ బేస్​పై టీజేపీ మిలిటెంట్లు దాడి చేశారు. మిలటరీ ఆపరేషన్​లో ఆ మిలిలెంట్లు హతమయ్యారు. జులైలో బలూచిస్తాన్ ప్రావిన్స్ లో నలుగురు సైనికులను టీజేపీ మిలిటెంట్లు చంపేశారు. కాగా, అఫ్గానిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాక్ లో టెర్రర్ దాడులు పెరిగిపోయాయి.

వేర్వేరు ఆపరేషన్లలో 21 మంది టెర్రరిస్టులు హతం.. 

దేశంలో టెర్రరిజం అనేదే లేకుండా చేయాలనే పట్టుదలతో భద్రతా బలగాలు పని చేస్తున్నాయని పాక్​ ఆర్మీ తెలిపింది. ఇంటెలిజెన్స్ సమాచారంతో రెండు వేర్వేరు ఆపరేషన్లు చేపట్టి 21 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు చెప్పింది. డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని దారాజిందా ఏరియాలో దాక్కున్న 17 మంది టెర్రరిస్టులను హతం చేసినట్టు పేర్కొంది. కులాచి ఏరియాలో చేపట్టిన ఆపరేషన్ లో మరో నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు వివరించింది. ఈ ఆపరేషన్లలో పెద్ద ఎత్తున వెపన్స్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. కులాచిలో చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది.