టెస్లాపై స్టేట్​ వర్సెస్​ సెంటర్..​ ఏప్రిల్ నెలాఖరులో ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్

టెస్లాపై స్టేట్​ వర్సెస్​ సెంటర్..​  ఏప్రిల్ నెలాఖరులో ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్
  • తెలంగాణలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్​ సీరియస్​ ఎఫర్ట్​
  • ఇప్పటికే ఇక్కడ ఉన్న అవకాశాలపై డిటైల్డ్​ రిపోర్ట్​ చేరవేత
  • ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన
  • కానీ.. గుజరాత్​కు ఫస్ట్​ ప్రయారిటీ ఇస్తున్న కేంద్రం
  • ఆ తర్వాత మహారాష్ట్ర, యూపీ వైపు మొగ్గు!

పెట్టుబడులు పెట్టడానికి టెస్లా ఒక ప్రాంతాన్ని ఎంచుకుందంటే.. ఇతర ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా ఆ ప్రాంతంలో బిజినెస్​ విస్తరణకు ఆసక్తిని చూపిస్తాయి. పైగా ఆ ఏరియాలో చాలా మందికి ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా ఆ రాష్ట్ర ఎకానమీకి మరింత ఊతం వస్తుంది. దీంతో రాష్ట్రాన్ని టెస్లా ఎంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నది. అదే సమయంలో టెస్లాను గుజరాత్​, మహారాష్ట్ర, యూపీ  వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏర్పాటు చేయించాలని సెంట్రల్​ గవర్నమెంట్​ చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రధాన కంపెనీలు, ప్రాజెక్టులను బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం తరలిస్తున్నదని ఇతర రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు టెస్లా విషయంలోనూ అదే జరుగుతుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దిగ్గజ కంపెనీని వదులుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.  

ఇండస్ట్రీ పాలసీపై రాష్ట్ర సర్కార్​ రిపోర్ట్​

టెస్లా ప్లాంట్​ను తెలంగాణలో ఏర్పాటు చేయించేందుకు రాష్ట్రంలో ఏమేమి అనుకూలతలు ఉన్నాయో అన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ–మెయిల్స్​ ద్వారా టెస్లాకు రిపోర్టును  చేరవేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఇండస్ట్రీ పాలసీలో భాగంగా టెస్లాకు స్పెషల్​ ఆఫర్లు కూడా ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ల్యాండ్​తో పాటు భారీగా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. 

ఇప్పటికే తెలంగాణలో ఉన్న దిగ్గజ కంపెనీలు.. వాటి గ్రోత్​, హైదరాబాద్​ గ్లోబల్​ సిటీ వివరాలను రెడీగా ఉంచుకుంది. టెస్లా తెలంగాణకు వస్తే ఉపాధి అవకాశాలు పెరగడం ఒక ఎత్తయితే.. టెస్లా బ్రాండ్​ ఇమేజ్  మరొక ఎత్తు అవుతుందని ఇండస్ట్రీస్​ నిపుణులు చెప్తున్నారు. టెస్లా ప్లాంట్​ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్​ పెట్టుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో ప్లాంట్​ ఏర్పాటుకు ఉన్న అపార అవకాశాలను వివరించినట్లు సమాచారం. 

ఈ క్రమంలోనే టెస్లాను గుజరాత్ లేదా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​కు తరలించేలా కేంద్రం ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది. అయినప్పటికీ ఈ కంపెనీని ఎలాగైనా రాష్ట్రానికి రప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో దావోస్​ పర్యటనలో దాదాపు 200 కంపెనీలతో సంప్రదింపులు జరిపి రూ.40 వేల కోట్లకు పైన రాష్ట్రంలో పెట్టుబడులకు స్టేట్​ గవర్నమెంట్​ ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఇప్పుడు అదే ఉత్సాహంతో టెస్లాను కూడా రాష్ట్రానికి రప్పించాలని ప్రయత్నిస్తున్నది. టెస్లా వంటి కంపెనీలు వస్తే రాష్ట్ర ఎకనామీ పెరుగుతుందని అనుకుంటున్నది. 

అన్నింటికీ గుజరాత్​ వైపే!

కేంద్రం ప్రకటించే వివిధ ప్రాజెక్టులు, సంస్థల ఏర్పాటు, విదేశీ కంపెనీల పెట్టుబడులు వంటి వాటిలో ఎక్కువ శాతం గుజరాత్​కే సెంట్రల్​ గవర్నమెంట్​ ప్రాధాన్యం ఇస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ తర్వాత యూపీని, మహారాష్ట్రను ఆప్షన్ గా పెట్టుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బుల్లెట్​ ట్రయిన్స్​, జాతీయ విద్యా సంస్థలు, కోచ్​ ఫ్యాక్టరీ,  ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ తో పాటు ప్రైవేట్​లో సెమీ కండక్టర్​ ప్లాంట్​, టాటా ఎయిర్​ బస్​, హోండా, హీరో, ఎంజీ వంటి కార్ల కంపెనీల పెట్టుబడులు ఇతరత్రా వంటివన్నీ  గుజరాత్​లో ఉన్నాయి. ఇప్పుడు టెస్లా తయారీ ప్లాంట్​కు గుజరాత్​కు కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్​ కాకుంటే ఆ తర్వాత మహారాష్ట్రలోకానీ, యూపీలో కానీ టెస్లా ప్లాంట్​ను ఏర్పాటు చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.