హైదరాబాద్‌లో క్విక్-కామర్స్ డార్క్ స్టోర్లలో తనిఖీలు.. కాలం చెల్లిన వస్తువులు, కుళ్లిన కూరగాయలు

హైదరాబాద్‌లో క్విక్-కామర్స్ డార్క్ స్టోర్లలో తనిఖీలు.. కాలం చెల్లిన వస్తువులు, కుళ్లిన కూరగాయలు

హైదరాబాద్ నగరంలో క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డార్క్ స్టోర్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ వింగ్ (TG SAFE) దాడులు చేపట్టింది. నగరంలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పలు స్టోర్లలో ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఫుడ్స్, పాడైపోయిన ఆహార పదార్థాలు, పురుగులు, అపరిశుభ్ర వాతావరణం బయటపడటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీల కోసం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ ని రంగంలోకి దించారు.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, డ్రాప్‌క్స్ లాజిస్టిక్స్ వంటి ప్రముఖ క్విక్-కామర్స్ సంస్థలకు చెందిన మొత్తం 16 డార్క్ స్టోర్లలో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కొన్ని స్టోర్లలో బూజు పట్టిన చీజ్ ప్యాకెట్లు, కాలీఫ్లవర్‌లో పురుగులు, ఫంగస్ పట్టి పాడైపోయిన కూరగాయలు, మంచులా గడ్డకట్టిన ప్యాకేజ్డ్ వస్తువులు కనిపించాయి. అలాగే కూలింగ్ స్టోర్ రూమ్స్ ఉష్ణోగ్రతల్లో లోపాలకు తోడు సరైన స్టోరేజీ పద్ధతులు పాటించకపోవటం బయటపడింది.

ఈ దాడుల్లో రూల్ ఫాలో అవ్వని డార్క్ స్టోర్ల FSSAI లైసెన్సులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. పెట్ బషీరాబాద్, సైదాబాద్‌లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స్టోర్లు, చౌక్ మహమ్మద్ ఖాన్, పత్తర్ గట్టి, చార్మినార్‌లోని ఫ్లిప్‌కార్ట్ అవుట్లెట్లు, రామకోటిలోని జెప్టో స్టోర్లపై ఈ సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఈ చర్యలు కేవలం పేర్కొన్న నిర్దిష్ట స్టోర్లకే వర్తిస్తాయని, డ్రాప్‌క్స్ లాజిస్టిక్స్‌పై ఎలాంటి సస్పెన్షన్ ఉత్తర్వులు లేవని స్పష్టం చేశారు. కల్తీపై అనుమానంతో మొత్తం 15 నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు.

ALSO READ ; హైదరాబాద్ లోని కాస్మెటిక్ షాపుల్లో మేడ్ ఇన్ పాకిస్థాన్ ప్రాడక్ట్స్...

ఈ తనిఖీల సందర్భంగా 3 స్టోర్లకు మెరుగుదల నోటీసులు, మరో 5 స్టోర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసుల అనంతరం తదుపరి చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. క్షణాలలో నిత్యావసరాలను ఇంటికి చేరవేస్తున్న క్విక్-కామర్స్ రంగానికి చెందిన డార్క్ స్టోర్లలోని పరిశుభ్రతపై ఈ దాడులు తీవ్ర చర్చకు దారితీశాయి. మరోవైపు వినియోగదారులు డెలివరీ సమయంలో వస్తువుల గడువు తేదీలు, ప్యాకేజింగ్, నాణ్యతను పరిశీలించాలని.. పాడైపోయిన ఆహారాన్ని తినవద్దని టీజీ సేఫ్ విజ్ఞప్తి చేసింది. ఏదైనా సమస్య ఉంటే బిల్లులు, ఫోటోలతో సహా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.