
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. గ్రూప్1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించేందుకు గురువారం (సెప్టెంబర్ 11) కమిషన్ ప్రత్యేకంగా భేటీ అయ్యింది.
మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని ఈ మేరకు కమిషన్ నిర్ణయించింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు సింగల్ బెంచ్ తీర్పు కాపీపై టీజీపీఎస్సీ లీగల్ టీం గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తుంది. మరో వారం రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉన్నట్లు టీజీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.
గ్రూప్1 మెయిన్స్ ఫలితాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేస్తూ మంగళవారం (సెప్టెంబర్ 9) తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది.
ALSO READ : పౌరసత్వం కేసులో సోనియా గాంధీకి భారీ ఊరట
రీవాల్యుయేషన్కు వీలు కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. రీవాల్యుయేషన్కు టీజీపీఎస్సీకి హైకోర్టు 8 నెలల డెడ్‌లైన్ విధించింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. పరీక్షకు మొత్తం 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10, 2025న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను TGPSC విడుదల చేసింది.
ఈ క్రమంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయవద్దని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది.
గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించారు. పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలున్నాయన్నారు. అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21 వేల మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5 వేల మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్ జరిపారని, అడుగడుగునా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు.
కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పరీక్షలను రద్దు చేయాలని కోరారు. అయితే.. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కమిషన్ తరఫు న్యాయవాది తెలిపారు. మూల్యాంకనంలో సందేహాలున్న చోట రెండు, మూడు సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు.